
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో, సూళ్లూరుపేట - శ్రీహరికోట నుంచి ఈ నెల 30న పిఎస్ఎల్వి సి-53 రాకెట్ ద్వారా మూడు సింగపూర్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. సింగపూర్‌తో కుదుర్చుకున్న పూర్తి వాణిజ్య ఒప్పందాలతో ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. సింగపూర్‌కు చెందిన 365 కిలోల భూపరిశీలన ఉపగ్రహం డిఎస్-ఇఒతో పాటు, 155 కిలోల న్యూసర్ ఉపగ్రహాన్ని, నానియంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన 2.8 కిలోల స్కూబ్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి 25 గంటల కౌంట్‌డౌన్‌ను బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఇస్రో ప్రారంభిస్తుంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు పిఎస్ఎల్వి సి-53 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.