Aug 07,2022 16:59

బర్మింగ్‌హోమ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం, ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లి మరో మెడల్‌ను ఖాయం చేసుకుంది. సెమీస్‌లో సింగ్‌పూర్‌కు చెందిన యో జియా మిన్‌పై 21-19, 21-17 తేడాతో సింధు అద్భుత విజయం సాధించింది.
ఆరంభం నుంచే సింధు, మిన్‌ ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. పాయింట్ల కోసం ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు తప్పలేదు. అయితే కీలకమైన సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా పీవీ సింధు తొలి సెట్‌ను రెండు పాయింట్ల తేడాతో కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్‌లోనూ ఆధిక్యం మారుతూ వచ్చింది. అయితే 11-9 ఛేంజ్‌ఓవర్‌ తర్వాత మిన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌పాయింట్‌ను సాధించి పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది.