
ఊరంతా... కవి సమ్మేళనాల జాతర
అసలు రాగాలే తెలియని కాకుల చేత
పాటలు పాడించాలని సంబరాల సంతకాలు
వాడిపోయిన వసంతానికి
అసత్యాల పూలజడలు అల్లుతూ..
చేదును మాత్రమే మిగిల్చుకున్న సామాన్యులకు
చినిగి ముక్కలైపోయిన తలపాగాలను
తలా జానెడు పంచుతున్నారు
గర్భస్రావం పొందుతున్న సందర్భాల నుంచి
పుట్టని బిడ్డకు అప్పుడే లాలపోసి
లాలిపాటలు పాడుతున్నారు...
తాకట్టుపెట్టిన మనసు మైదానాల మీద
అవాస్తవాల గంజాయి మొక్కల్ని పెంచుకుంటూ...
తాళం తప్పుతున్న కవితా గానాలతో
మనస్సాక్షికి మరణశాసనం రాసుకుంటున్నారు
వేషాలను అనుకరిస్తూ హాజరైన
కవులు కాని కవుల పగటివేషం
సభలోని అందరి చూపుల్ని కొనుగోలు చేస్తోంది
అబద్ధాల కవితల్ని.. పిచ్చోడి చేతిలోని రాయిలా
విసిరిన ప్రతిసారీ సాహిత్యపు నిలువుటద్దాన్ని
బద్దలు కొట్టే ప్రయత్నం జరుగుతోంది
చప్పట్ల శబ్దాలకు నిశ్శబ్దంగా
మురిసిపోతున్న ముఖాలు
అశాస్త్రీయ సాహిత్య శవపేటికల్ని
భుజాల మీద మోస్తున్నాయి
శాలువా, జ్ఞాపికల ఆనందంలో
మురిసిపోతున్న నవ్వులన్నీ
సమ్మేళనాల జాతరలో
తలలు తెగిన మేకపోతులవుతున్నాయి!
సన్మానాలకు మాత్రమే
పరిమితమవుతున్న కొన్ని కవి జన్మలు
తిరిగి ఏడాది నిద్రకు
సమాధులు నిర్మించుకుంటున్నాయి
ప్రజాసమస్యల అంచుల నుంచి
దూరంగా ఆలోచించే కవి ఎవరైనా
రేపటి కాలం వాకిళ్లకు
దిష్టిబొమ్మగా మాత్రమే మిగిలిపోతారు!
వేదికల సాక్షిగా అందుకునే సత్కారాల కోసం
వాస్తవాలను తీవ్రంగా ...
నిర్లక్ష్యం చేస్తున్న కవితా గానాలన్నీ
తడిస్తే చాలు, నిండా మునిగిపోయే
కాగితం పడవలు మాత్రమే ..!
- డా. కె.జి. వేణు
98480 70084