
కామారెడ్డి: టీఎస్‌పీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అధికార భారత్ రాష్ట్ర సమితికి చెందినవారి హస్తం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ తతంగంలో చిన్న చిన్న వారిని కాకుండా తిమింగలాలను బజారులో శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా టీఎస్‌పీఎస్సీ వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పినా ప్రజలు రెండుసార్లు అవకాశం కల్పించారన్నారు. నిరుద్యోగుల సమస్యను కేసీఆర్ పరిష్కరించలేదన్నారు. ''రాష్ట్రంలో ఏ పరీక్ష చూసినా పేపర్ లీకులే.. భారాస పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయి. ఈ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసేస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీకి కారణం.. కేటీఆర్. ఆయన్ను ఎందుకుమంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేయరు? పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈ నెల 22న గవర్నర్‌ను కలుస్తాం'' అని రేవంత్ అన్నారు.
పరీక్ష పత్రాల లీకేజీ పరిణామాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌పై హత్యానేరం కింద కేసు పెట్టాలన్నారు. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని.. వారికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని..కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.