Mar 18,2023 13:50

పారిస్‌ : మాక్రాన్‌ ప్రభుత్వం తెచ్చిన పెన్షన్‌ స్కీం సవరణలకు వ్యతిరేకంగా పారిస్‌లో గత కొన్ని రోజులుగా సమ్మెలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పెన్షన్‌ స్కీంకు వ్యతిరేకంగా మున్సిపల్‌ కార్మికులు మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ప్రభావం వల్ల పారిస్‌ నగర వీధుల్లో 10 వేల టన్నుల చేత్త పేరుకుపోయిందని మేయర్‌ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. అలాగే ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోవడం వల్ల స్థానికులకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని, వ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మున్సిపల్‌ కార్మికుల సమ్మె గురించి పారిస్‌ మేయర్‌ అన్నే హిడాల్గ్‌ మాట్లాడుతూ... 'కార్మికులకు నిరసన తెలిపే హక్కు ఉంది. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా తిరిగి విధుల్లోకి రావాలని బలవంతం చేయడం సరైన చర్య కాదు. మాక్రాన్‌ ప్రభుత్వం బలవంతపు చర్యల కంటే... సమస్య పరిష్కరించేందుకు వారితో బహిరంగ చర్చకు పిలవడమే ఆమోదయోగ్యమైన చర్యగా నేను అభిప్రాయపడుతున్నాను. ప్రభుత్వం చేస్తున్న బలవంతపు చర్యలను నేను వ్యతిరేకిస్తున్నాను' అని ఆయన అన్నారు.
కాగా, మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రభావంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని 20 జిల్లాల్లో 10 జిల్లాలపై ఈ సమ్మె తీవ్ర ప్రభావం చూపింది. పదవీ విరమణ వయసు 62 నుంచి 64కు పెంచే చట్టాన్ని గురువారం జరిగిన పార్లమెంట్‌లో తుది ఓటింగ్‌ నిర్వహించకుండానే మాక్రాన్‌ ప్రభుత్వం ఆమోదించింది. అయితే పార్లమెంటరీ ఓటు లేకుండానే ప్రభుత్వమే చట్టాలను ఆమోదించేందుకు పారిస్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 49.3 వీలు కల్పిస్తుంది. ఈ చట్టం ఆమోదం పొందడంపై నిరసనకారులు మరోసారి ఆందోళన చేపట్టారు. వీధుల్లోని చెత్త కంటైనర్‌లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.