May 21,2023 09:18

'ఎన్నాళ్ళనుంచో కలగన్న కోరిక ఇప్పటికి నెరవేరింది' అన్న సరదా తీరనే లేదు. నా ప్రాణ స్నేహితుడు, శరత్‌తో కొన్నిరోజుల పాటూ ఆనందంగా గడపాలని అమెరికా నుంచి బెంగళూరు వచ్చాను. వచ్చిన నాలుగు రోజులకే వాడు చెన్నై వెళ్లాల్సిన పనిపడింది. వాళ్ళ అమ్మ గారి ఆరోగ్యం బాగుండకపోవడంతో భార్యా సమేతంగా వాడు వెళ్ళక తప్పలేదు. తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చినందుకు బాధ పడుతూ, నాలుగు రోజులలో తిరిగి వచ్చేస్తామని చెప్పి, ఇల్లు అప్పగించి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఐదు గంటలకే మెలకువ వచ్చేసింది. బ్రష్‌ చేసుకుని వాకింగ్‌కి బయల్దేరి రోడ్డెక్కాను. శరత్‌ ఉన్న 'నంది నగర', చికబానవర అనే ప్రాంతంలో ఉన్న చిన్న కాలనీ. పేరుకి బెంగళూరులో ఉందన్న మాటేగానీ, ఆ ప్రాంతమంతా పల్లెటూరిలాగే ఉంటుంది. ఆ కాలనీలో ఊర కుక్కలు ఎక్కువే. అమెరికాలో అలాంటి వాతావరణం ఉండదు కనుక నాకంతా కొత్తగా ఉంది. రోడ్డుమీద కొన్ని కుక్కలు కనిపించాయి. బాగా చలిగా ఉండడం వల్ల, అవి ముడుచుకొని పడుకోవడంతో ధైర్యంగా ముందుకు నడిచాను. అయితే ఒక కుక్క మాత్రం లేచి, నాకు అడ్డంగా నిలబడి మొరగసాగింది. ఆ అరుపుకి మరో రెండు కుక్కలు లేచి, అరవడం మొదలుపెట్టాయి. వాటిని చూడగానే భయం వేసింది. అంత చలిలోనూ నాకు చెమటలు పట్టాయి. కంగారుపడుతూ వెనకడుగు వేశాను. భయపడుతూ వెనక్కి తిరిగి, ఇంటికొచ్చేశాను. మార్నింగ్‌ వాక్‌ చేయకపోవడం నాకు ఏదోగా ఉంది. నాకు అది బాగా అలవాటు అయిపోవడంతో, అది లేని రోజంతా చాలా చిరాకుగా ఉంటుంది. ఏదో తెలియని లోటు కనిపిస్తూ ఉంటుంది. అంతలా అలవాటు పడిపోయాను, ఉదయపు నడకకు.
మర్నాడు కూడా అదే పరిస్థితి కాబట్టి, దానిని ఎదుర్కోవడానికి ఏమి చెయ్యాలా? అని దీర్ఘంగా ఆలోచించాను. ఇల్లంతా వెతికితే, మూడడుగులు పొడవున్న సన్నటి వెదురు కర్ర దొరికింది. దాన్నిచూడగానే నాలో హుషారు వచ్చింది. మర్నాడు వేకువజామునే ఆ కర్రను పట్టుకొని విజయగర్వంతో రోడ్డెక్కాను. నా చేతిలో కర్రను చూడగానే కుక్కలు తోకముడిచి, నా వైపు కోపంగా చూస్తూ గుర్రుమన్నాయి. నేను నవ్వుకుంటూ, కర్ర ఊపుతూ నడవడం మొదలుపెట్టాను.
కొన్ని సందుల్లో లైట్లు లేకపోవడంతో కాస్త చీకటిగానే ఉంది. ఒక సందులోకి తిరిగేసరికి హఠాత్తుగా, ఒక్కసారిగా నాలుగు కుక్కలు నా మీద దాడి చేశాయి. అనుకోని దాడికి తత్తరపడ్డాను. చేతిలో ఉన్న కర్రను గాలిలో తిప్పుతూ వాటిని తరమడానికి ప్రయత్నించాను. అయితే ఆ ప్రయత్నంలో కర్ర, పక్కనే ఉన్న గోడకు తగిలి రెండు ముక్కలయింది. అంతే..!
'నా పనయిపోయింది. ఆ కుక్కలు నన్ను చీల్చి చెండాడేస్తాయి. ఇప్పుడెలారా దేవుడా?' అనుకుంటూ భయపడిపోయాను. అనుకున్నట్లే అయింది. ఒక కుక్క ముందుకు దూకి, నా కాలు పట్టుకుంది. నేను భయంతో గిజ గిజలాడుతూ విదిలించుకునే ప్రయత్నం చేస్తుండగా, సైకిల్‌ మీద అక్కడికి వచ్చిన వ్యక్తి వల్ల నాకు రక్షణ లభించింది. అతనో రెండు రాళ్ళు విసిరి, వాటిని అదిలించేసరికి, అవి భయపడి పారిపోయాయి. అతను నా వైపు తిరిగి, 'ఈ హళ్ళిగే వసుబురా?' అని అడిగాడు. కన్నడం నాకు అర్థం కాకపోవడం వల్ల, తెల్ల మొహం వేశాను. నేను సమాధానం ఇవ్వకపోయేసరికి కన్నడంలో ఏదో చెపుతూ ముందుకు దారి తీశాడు. అదృష్టవశాత్తు చిన్న గాయమే అయింది. అయినా రక్తం కారుతూనే ఉంది. ఆ గాయాన్ని చేతితో అదిమిపెట్టి, బాధను సహిస్తూ కాస్సేపు అక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత ఇంటికొచ్చి, డెట్టాల్‌తో గాయాన్ని శుభ్రం చేసుకొని, కుర్చీలో కూలబడ్డాను. 'ఆ కుక్క ఎలాంటిదో? కొంపదీసి రేబిస్‌ ఉన్న కుక్క కాదు కదా? ఏది ఏమయినా అర్జెంట్‌గా డాక్టర్‌ దగ్గరికి వెళ్లి, ఇంజక్షన్‌ చేయించుకోవాలి' అనుకున్నాను.
'అమెరికాలో ఇలాంటి ఇబ్బందులు ఏవీ ఉండవు. అక్కడి కుక్కల తీరే వేరు. అక్కడివన్నీ పెంపుడు కుక్కలే. అన్నిటికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేయిస్తారు. బయటకు తిప్పేవాటికి, తప్పనిసరిగా ట్రయినింగ్‌ ఇప్పిస్తారు. ఆ కుక్కలు ఒకదానికొకటి ఎదురుపడినా, ఇక్కడిలా అరుచుకోవు. ఒకదానితో మరొకటి పోట్లాటకు దిగవు. అటువంటి వాతావరణం నుంచి ఇక్కడికొచ్చి ఇలా దొరికిపోయానేమిటి?' అనుకుంటూ చింతిస్తూ కూర్చున్నాను.
నందినగరలో కుక్కల బెడద ఉదయం పూట మాత్రమే. ఉదయం ఎనిమిది అయ్యేసరికి అక్కడి రోడ్ల మీద జనంతో సందడి మొదలవుతుంది. అప్పటివరకూ రోడ్లను ఆక్రమించి, అడ్డదిడ్డంగా పడుకునే కుక్కలు ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. మళ్ళీ సాయంత్రం వరకూ ఆ ఛాయలకు రావు. అందుకే ధైర్యంగా డాక్టర్‌ దగ్గరకు వెళ్లి, ట్రీట్మెంట్‌ చేయించుకోగలిగాను. డాక్టర్‌ రెండు ఇంజక్షన్లు చేసి, మందులు రాసి ఇచ్చాడు. కుక్క చేసిన గాయం కన్నా, ఇంజక్షన్ల బాధే అధికంగా ఉంది. దీనికంతకూ కారణమయిన కుక్కల్ని తిట్టుకుంటున్న సమయంలో, శరత్‌ నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. 'తిరుగు ప్రయాణం మరో మూడు రోజులు వాయిదా పడిందని, అందుకు ఎంతో చింతిస్తున్నామని' ఆ మెసేజ్‌ సారాంశం. దాంతో నాకు నీరసం ఆవహించింది. ఏదయినా మందు పెట్టి, ఆ కుక్కల్ని చంపేయాలని కసితో రగిలిపోతూ, ఎలుకల మందు కొన్నాను. చికెన్‌ బిరియానీలో కలిపేసి, రాత్రి వేళ వాటికి దగ్గరగా విసిరేసి, వాటి పీడ వదిలించుకోవాలని ప్లాన్‌ వేశాను. అప్పటికిగానీ నా మనస్సు శాంతించలేదు. కానీ కాస్సేపటిలోనే నా మనస్సును మార్చుకున్నాను. దానికి కారణం ఆ కుక్కలతో పాటూ ఉండే వాటి కూనలే. 'అయ్యో..! ఏ పాపం ఎరుగని ఆ కుక్కపిల్లలు కూడా చచ్చిపోతాయే ! అయినా ఎంత రాక్షసంగా ఆలోచించాను? ఇదేనా పరిష్కారం? ఇంత అవివేకంగా ఆలోచించానేమిటి?' అనుకుంటూ నన్ను నేనే తిట్టుకొని, ఎలుకల మందును కాలవలో గిరాటు వేశాను.
ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి, తలపట్టుకు కూర్చున్నాను. 'వాకింగ్‌ సమస్య తీరేదెలా?' అనుకుంటూ. ఇక్కడి వాతావరణం చాలా బాగుంది కాబట్టి రెండు పూటలా వాకింగ్‌ చేసేయాలని, ఆవిధంగా కొంత కాలక్షేపం అవుతుందని ఊహించిన నాకు ఇలా ఊర కుక్కలు అడ్డంగా పడతాయని ఊహించలేదు. అలా కిందా మీదా పడుతున్న సమయంలో నాకో ఐడియా తట్టింది.
మర్నాడు ఉదయమే దాన్ని అమలు చేశాను. మా వీధి దాటగానే కుక్కలు మొరగడం మొదలుపెట్టాయి. నా చేతిలో కర్ర లేకపోవడంతో అవి మరీ రెచ్చిపోవడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా జేబులోంచి ఒక బిస్కెట్‌ పాకెట్‌ బయటకు తీశాను. దాన్ని చూడగానే వాటి కదలికలో మార్పు వచ్చింది. పేకెట్‌ లోంచి ఒక బిస్కెట్‌ పైకి తీయగానే, ఒక కుక్క కాస్త ధైర్యం చేసి, నా దగ్గరకు వచ్చి తోకాడించడం మొదలుపెట్టింది. బిస్కెట్‌ దాని నోటికి అందించే ధైర్యం లేక, దానికి దగ్గరగా విసిరాను. నేల మీద పడీ పడకముందే దాన్ని నోటితో అందుకుంది, హుషారుగా. మరో బిస్కెట్‌ విసిరేసరికి మిగిలిన కుక్కలన్నీ నా చుట్టూ చేరి, తోకాడించటం మొదలయింది. ఒక పెద్ద బిస్కెట్‌ పాకెట్‌ అక్కడే ఖాళీ అయిపోయింది. నవ్వుకుంటూ ముందుకు కదిలాను, మరో వీధిలో ఉన్న కుక్కలను మచ్చిక చేసుకోవడానికి. అలా నా సమస్య తీరిపోయింది. అప్పటి నుంచీ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నిరాఘాటంగా వాకింగ్‌ చేయడం మొదలుపెట్టాను, ఆనందంగా బిస్కట్లు పంచుతూ.
ొొొ
ఒక రోజు సిటీలో కొన్ని పనులు చూసుకొని, సినిమా చూసి వచ్చేసరికి, బాగా లేట్‌ అయిపోయింది. అంత రాత్రిలో క్యాబ్‌ దొరకడం కూడా కష్టం అయింది. డ్రైవర్‌ కారుని మెయిన్‌ రోడ్డు మీదే ఆపేసి, డెస్టినేషన్‌ అదే అని బుకాయించాడు. వాడికి ఇంగ్లీష్‌ అర్థం కాదు, నాకు కన్నడం రాదు. వాడికి ఏమి చెప్పినా ప్రయోజనం లేదని, నడుచుకుంటూ మా కాలనీ వైపు నడిచాను. రెండు సందులు తిరిగానో లేదో ఇద్దరు దొంగ వెధవలు నన్ను అటకాయించారు. వాళ్ళలో కత్తి పట్టుకున్నవాడు కన్నడంలో అరుస్తున్నాడు. పర్సు, మొబైల్‌, మెడలో చైను, ఉంగరాలు తీసి ఇమ్మని, లేకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని నాకు అర్థం అయింది. షాక్‌ తిన్న నేను, బొమ్మలా నిలబడిపోయాను. కత్తి పట్టుకున్నవాడు సహనం కోల్పోయినట్లున్నాడు. నా మీదకు దాడి చేసే ప్రయత్నంలో ముందుకు ఉరికాడు. దాంతో నా ప్రాణాలు పోయినట్లైంది. భయంతో గజ గజమని వణుకుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయోగానీ, నాలుగు కుక్కలు ఆ దొంగల మీద హఠాత్తుగా దాడి చేశాయి. దాంతో ఆ వెధవలు జడుసుకున్నారు. కత్తి జారి కిందపడడంతో వాళ్లు మరీ భయపడిపోయారు. కుక్కల్ని బెదరగొట్టి తరిమేయాలని వాళ్లు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోయేసరికి, వాళ్లు కాళ్ళకు బుద్ధిచెప్పాల్సి వచ్చింది. వాళ్ళను తరిమేశాక, విజయగర్వంతో నా దగ్గరకు వచ్చి తోకాడిస్తున్న జాగిలాలను చూసి, ఆనందపడ్డాను. నన్ను రక్షించిన ఆ నాలుగు కాళ్ళ జీవులకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కాలేదు. వాటి తలల మీద చేయి వేసి నిమురుతూ, చాలాసేపు అక్కడే గడిపేశాను.

కొయిలాడ రామ్మోహన్‌ రావు
9849345060