
పిట్ట పాట మరిచిపోవడం ఏమిటి? మరిచిపోతే నేర్పించవచ్చా? అసలు పిట్ట పాట పాడటమేమిటి అని మాత్రం అడగరు. ఎందుకంటే పక్షులు కొన్ని రాగాలు తీస్తూ పాటలు ఆలపిస్తూంటాయి. అలా పాడే పిట్టలు కొన్ని మాత్రమే ఉంటాయి. పాటలు పాడే పిట్టలు రాను రానూ ఆ పాటను మరిచిపోయాయి. మరి వాటికి పాట నేర్పించేందుకు పక్షి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. మరి ఆ పాట పాడే పిట్ట ఏమిటో? దాని పాటేమిటో? దాని కథాకమామిషు తెలుసుకుందాం..
ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆగేయ దిశలో రీజెంట్ హనీ ఈటర్ అనే పక్షి ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు ఈ పక్షి అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలోకి చేరిపోయింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 300 రీజెంట్ హనీఈటర్లు మాత్రమే మనుగడలో ఉన్నాయి.
'ఇవి తమ తోటి హనీఈటర్లతో కలిసి తిరిగే అవకాశం లేకుండాపోతోంది. అందువల్ల అవి తమ జాతిలాగా ఎలా పాడాలో నేర్చుకునే అవకాశం దొరకటం లేదు' అని డాక్టర్ రాస్ క్రేట్స్ వివరించారు. యూకే రాయల్ సొసైటీ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ఆయన ఈ హనీఈటర్ల గురించి రాసిన వివరాలన్నీ ప్రచురించారు. ఆయన కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో డిఫికల్ట్ బర్డ్ పరిశోధనా బృందంలో సభ్యులు.
- నేర్పించే ప్రయత్నం..
ఈ పాడే పక్షి పాటని సంరక్షించేందుకు డాక్టర్ రాస్ ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని పక్షులను బంధించి పట్టుకుని, వాటి బంధువులు పాడిన పాటలను వాటికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు.
'ఇవి చాలా అరుదైన పక్షులు. వీటిని వెతికే క్రమంలో ఆయన కొన్ని విచిత్రమైన పాడే మరికొన్ని పక్షులను కనుగొన్నారు.
- పాడటం నేరుస్తాయి..!
'అవేమీ రీజెంట్ హనీఈటర్‌లా పాడటం లేదు. అవి వేరే జాతికి చెందినవని అర్థమవుతోంది. మనుషులు ఒకరి నుంచి ఒకరు మాట్లాడటం నేర్చుకున్నట్లే పాడే పక్షులూ పాడే విధానాన్ని నేర్చుకుంటాయి' అన్నారాయన.
'పక్షులు పెరిగి పెద్దయ్యాక వాటి గూడును వదిలి, బయట ప్రపంచంలోకి అడుగుపెట్టే టప్పుడు అవి వయసులో ఉన్న మగ పక్షులతో కలవడం అవసరం. అలా జరగడం వలన అవి ఎలా పాడుతున్నాయో విని, ఆ పాటను తిరిగి పాడటం మొదలుపెడతాయి' అని వివరించారు.
'రీజెంట్ హనీఈటర్ 90 శాతం జీవావరణాన్ని కోల్పోయింది. దీనివల్ల చిన్న మగ పక్షులు మిగిలిన పక్షులకు తారసపడి, అవి పాడే పాటలు వినే అవకాశం ఉండటం లేదు. దీంతో, అవి వేరే పక్షుల పాటలు వినాల్సి వస్తోంది' అని డాక్టర్ రాస్ తెలిపారు.
రీజెంట్ హనీఈటర్ల పక్షిజాతిలో 12 శాతం సహజమైన పాట మాయమైపో యిందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ పాటను సంరక్షించాలనే ఆశతో శాస్త్రవేత్తలు ఆ పక్షుల పాటలను రికార్డు చేసి, హనీఈటర్లకు వినిపిస్తున్నారు. వీటి జనాభాను పెంచేందుకు ఇలా బంధించిన రీజెంట్ హనీఈటర్‌లలో కొన్నింటిని ప్రతి ఏటా తిరిగి అడవిలో వదిలిపెట్టే ప్రాజెక్టు నడుస్తోంది.
- ఆ పాటే కావాలి..
'కానీ, ఆ మగ పక్షులు మరో రకమైన విచిత్రమైన పాట పాడితే ఆడ పక్షులు వాటితో కలవడానికి రావు' అని డాక్టర్ రాస్ చెప్పారు.'అవి పాడాల్సిన పాట వింటే, వాటంతట అవే వాటి పాటను పాడటం నేర్చుకుంటాయని ఆశిస్తున్నాం' అన్నారాయన.
'ఏవైనా జీవ జాతులను సంరక్షించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు అవి అడవిలో బతికి, మనుగడ సాగించేందుకు కొన్ని పక్షులకు సహజంగా ఉండే పాట పాడటంలాంటి సాంస్కృతిక లక్షణాలు, జంతువులకు ఉండే కొన్ని సహజ ప్రవర్తనల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది' అన్నారు.
ఏమైనా భలే ఉంది కదా.. ఈ పాటల పిట్ట సంగతులు.. అవి ఆ పాటే నేర్చుకుని పాడాలని కోరుకుందాం.. మళ్లీ మళ్లీ పాడాలి మీ పాట.. మీ బతుకంతా సాగాలి పూల బాట.. అని మనం పాడదాం.