
మైసూలురు : కొద్దిరోజులుగా పవిత్రా లోకేశ్, నరేష్ ల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని బెంగళూరు మీడియా కోడై కూస్తోంది.. దీంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా పవిత్రా లోకేశ్, నరేష్ లు వార్తల్లోని హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. కన్నడ మీడియాలో వీరి గురించి రకరకాల కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఈ కథనాలకు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చేసిన ఆరోపణలు మరింత బలాన్ని చేకూర్చాయి.
ఇటీవలే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్ని పవిత్రా తోసిపుచ్చారు. తనను బ్యాడ్ చేయడానికే ఆమె కన్నడ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేశారని, ఆమె చెప్పిన మాటల్లో వాస్తవం లేదని అన్నారు. బెంగళూరులో ఓ చానెల్‌తో కలిసి ఆమె తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు హైదరాబాద్‌లోనూ ఇలాగే చేశారని పవిత్రా చెప్పుకొచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకుమించి తమ మధ్య మరే బంధం లేదని పవిత్రా, నరేష్ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తుండటంతో పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించారు.
మీడియా ప్రతినిధులపై పవిత్రా ఫిర్యాదు..
తనని కొందరు మీడియా ప్రతినిధులు వెంబడిస్తున్నారని మైసూలురులోని వీవీ పురం పోలీస్ స్టేషన్లో పవిత్రా ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని.. తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందే పవిత్రా తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, తన పరువుకు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు.