
న్యూఢిల్లీ : విభజన తర్వాత ఎపి, తెలంగాణ ప్రజలు అసంతృప్తికి గురయ్యారని ప్రధాని మోడి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని మోడి .... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావించారు. ముందుగా... లోక్‌సభలో 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై ప్రధాని ప్రసంగించారు. ఈ ప్రసంగంలో పార్లమెంట్‌లో భవనంతో ఉన్న అనుబంధం, పార్లమెంట్‌లో జరిగిన చర్చలు, మాజీ ప్రధానులు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, చేపట్టిన ప్రగతి శీల కార్యక్రమాల గురించి మోడి ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తీరును ప్రస్తావిస్తూ యుపిఎ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.
తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని చెప్పారు. అయితే యుపిఎ హయాంలో ఎపి విభజన సరిగ్గా జరగలేదని మోడి ఆరోపించారు. విభజన తర్వాత ఎపి, తెలంగాణ ప్రజలు అసంతృప్తికి గురయ్యారని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకోలేదన్నారు. వాజ్‌పేయి హయంలో కూడా కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని.. అప్పుడు విడిపోయిన రాష్ట్రాలు సంబరాలు చేసుకున్నాయని అన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలా.. ఎపి, తెలంగాణ విభజన జరగలేదని మోడి అన్నారు. అనేక దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పలు చారిత్రాత్మక నిర్ణయాలు, పరిష్కారాలు ఈ సభలో జరిగాయని చెప్పారు. ఆర్టికల్ 370 (రద్దు) దాని వల్లే సాధ్యమైందని సభ ఎప్పుడూ గర్వంగా చెబుతుందని ప్రధాని అన్నారు. ఇక్కడ కూడా జిఎస్‌టి పాస్ అయిందన్నారు. ఈ సభ సాక్షిగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు దేశంలో మొదటిసారిగా ఎలాంటి వివాదం లేకుండా విజయవంతంగా అనుమతించబడ్డాయని ప్రధాని మోడి అన్నారు.
;