Aug 05,2022 22:15

సెప్టెంబరు మొదటి వారంలోగా ఇా క్రాపింగ్‌
విద్యార్ధులకు డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులపై శిక్షణ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రైతులకు అందుతున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని సిఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం లో శుక్రవారం అధికారులతో వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు. ఆర్‌బికెల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి నిరంతరం ప్రతి రోజూ సమాచారం తెప్పించుకోవాలని సిఎం సూచించారు. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరల అంశంపై నిరంతరం ప్రతి ఆర్‌బికె నుంచి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా తెప్పించుకోవాలన్నారు. సెప్టెంబరు మొదటి వారంలోగా ఇ- క్రాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌బికెల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, రెవెన్యూ అసిస్టెంట్‌లు ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలని, రోజు వారీగా ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలన్నారు. ఇ -క్రాపింగ్‌ చేసిన తర్వాత భౌతిక రశీదు, డిజిటల్‌ రశీదు ఇవ్వాలని సిఎం పేర్కొన్నారు. ఇ- క్రాపింగ్‌ చేసినప్పుడు జియో ట్యాగింగ్‌ కూడా చేయడంతో పాటు వెబ్‌ల్యాండ్‌తో కూడా అనుసంధానం చేస్తున్నట్లు అధికారులు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకుంటూ పోవాలని అధికారులకు సూచించారు. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంతో, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన భాగస్వామ్యం కానుందని సిఎం వెల్లడించారు. రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సిఎం పేర్కొన్నారు. ఆర్‌బికెల్లో ప్రతి కియోస్క్‌ పనిచేసేలా చూడాలని, వాటికి సవ్యంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉందా లేదా అనేదానిపై నిరంతరం పరిశీలన చేయాలన్నారు. వైఎస్‌ఆర్‌ యంత్రసేవ కింద రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలని, అఒందు కోసం అన్నిరకాలుగా సిద్ధం కావాలని సిఎం , వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. వీటితో పటు వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలని, డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులపై శిక్షణ ఇచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. నియోజకవర్గానికి ఒక ఐటిఐ లేదా పాలిటెక్నిక్‌ కళాశాలలోని విద్యార్ధులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబందించిన వివరాలను వ్యవసాయాధికారులు సిఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యిందని, ఆగస్టు 3 నాటికి 16.2శాతం అధిక వర్షపాతం నమోదయ్యందని, ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 36.82లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా కాగా, ఇప్పటికే 18.8లక్షల హెక్టార్లలో పంటల సాగు అయినట్లు సిఎంకు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎపి అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవిఎస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయశాఖ) అంబటి కృష్ణారెడ్డి, సిఎస్‌ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సిఎస్‌ పూనం మాలకొండయ్య, సిసిఎల్‌ఎ జి.సాయిప్రసాద్‌, ఆర్దికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, వ్యవసాయశాఖ కమిషనరు సి. హరికిరణ్‌ పాల్గొన్నారు.