Jan 24,2023 16:18

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:యువగళం పేరుతో ఈ నెల 27 నుంచి నారా లోకేష్‌ చేపట్టనున్న పాదయాత్ర, పబ్లిక్‌ మీటింగులకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చామని చిత్తూరు జిల్లా ఎస్‌పి రిషాంత్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతుల కోసం పలమనేరు డిఎస్‌పి సుధాకర్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిఎ మనోహర్‌ వినతిపత్రం అందజేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 17 షరతులతో అనుమతి ఇచ్చామని తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకోకముందే కొన్ని సోషల్‌ మీడియా గ్రూపులలో అనుమతి ఇవ్వకుండా కక్షసాధింపుతో పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వంపై నిందలు మోపాలనే ఉద్దేశంతో వదంతులు సృష్టించి అసత్య ప్రచారాలు చేశాయని పేర్కొన్నారు.
నిబంధనలు ఇవే....
- పాదయాత్రలో ప్రజలకు, వాహనదారులకు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలూ కలిగించకూడదు.
-బహిరంగ సభల సమయానికి కట్టుబడి ఉండాలి.
- ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు ఎలాంటి నష్టమూ కలిగించకూడదు.
-రోడ్డ్లపై ఎలాంటి సమావేశాలూ నిర్వహించకూడదు.
-ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి నిర్వాహకులు సమావేశ స్థలంలో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమావేశ స్థలం దగ్గర అగ్నిమాపక యంత్రం ఉంచాలి.
- ఫైర్‌ క్రాకర్స్‌ పేల్చడం పూర్తిగా నిషేధం.
-పార్టీ కార్యకర్తలు, సమావేశంలో పాల్గనేవారు సమావేశంలోనికి మారణాయుధాలు తీసుకెళ్లకుండా నిర్వాహకులు నిర్ధారించుకోవాలి.
-నిర్వాహకులు డ్యూటీలో ఉన్న పోలీసుల ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటించాలి.
వీటితోపాటు మరికొన్ని నిబంధనలు ఉన్నాయి.