Sep 29,2022 21:22
  •  ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కింద కేసు పెట్టాలి
  •  దళిత, ప్రజా సంఘాల నిరసన ప్రదర్శన, అధికారులకు వినతి

ప్రజాశక్తి - అమరావతి (పల్నాడు జిల్లా) :  పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని అత్తలూరు సర్పంచ్‌ బంక సరోజినిని అవమానిస్తూ, ఆమె విధులకు ఆటంకం కలిగిస్తున్న పెత్తందార్లపై చర్యలతోపాటు సర్పంచ్‌ ప్రమేయం లేకుండా చేసిన పనులపైనా విచారణ చేయాలని కోరుతూ దళిత, ప్రజా సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేశారు. అమరావతిలోని అంబేద్కర్‌ విగ్రహం నుండి ఎంపిడిఒ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దళిత మహిళా సర్పంచ్‌పై పెత్తనం చేస్తున్న పెత్తందార్లపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయకుంటే ఆందోళ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వద్ద బాధిత సర్పంచ్‌ తన ఆవేదనను వెళ్లబోసుకున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. దీనిపై ఆయన సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ విజయశ్రీ, ఇఒపిఆర్‌డి ప్రసాద్‌బాబుకు వినతిపత్రాలు ఇచ్చారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ సరోజిని పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిఫెన్స్‌ లాయర్స్‌ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యు.పాపారావు, ప్రజా హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ హనుమాన్‌ శాస్త్రి, వైకుంఠపురం సర్పంచ్‌ ఎం.విఠల్‌రావు, కెవిపిఎస్‌, ఎంఆర్‌పిఎస్‌, అంబేద్కర్‌ ప్రజా సంఘం నాయకులు పాల్గొన్నారు.

dalith