Mar 17,2023 18:32

ప్రముఖ హీరో నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటించిన తాజా చిత్రం 'ఫలానా అబ్బాయి, షలానా అమ్మాయి. వీరి కాంబినేషన్‌లో 'కళ్యాణ వైభోగమే' చిత్రం మంచి హిట్‌ కొట్టింది. అలాగే ప్రముఖ దర్శకుడు అవసరాలశ్రీనివాస్‌, నాగశౌర్య కాంబినేషన్‌లో 'ఊహలు గుసగులాడే', 'జ్యో అచ్యుతానంద' విజయం సొంతం చేసుకున్నాయి. తాజాగా మరోసారి వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' చిత్రం మార్చి 17న శుక్రవారం థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందామా..!

కథ
సంజరు (నాగశౌర్య), అనుపమ (మాళవిక నాయర్‌) ఒకే కాలేజీలో బీటెక్‌ చదువుతుంటారు. బీటెక్‌లో జాయిన్‌ అయిన సంజరుని ఆ కాలేజీలో సీనియర్స్‌ ర్యాగింగ్‌ చేస్తుంటే.. అనుపమ అతన్ని సేవ్‌ చేస్తుంది. దీంతో వారిమధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎం.ఎస్‌ కోసం ఇద్దరూ లండన్‌కి వెళతారు. అక్కడికెళ్లిన తర్వాత స్నేహితులు కాస్తా.. ప్రేమికులవుతారు. ఇద్దరూ ప్రేమలోపడిన తర్వాత కొన్ని సంఘటనల వల్ల విడిపోతారు. వారిద్దరూ విడిపోవడానికి గల కారణాలేంటి? మళ్లీ కలుస్తారా? ఈ కథలో అవసరాల శ్రీనివాస్‌ పాత్ర ఏంటి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

movie review


విశ్లేషణ
నటుడు, డైరెక్టర్‌ అయిన అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చాలా సహజత్వంగా ఉంది. ఆయన రచనకు తగ్గట్టుగా సినిమా కథతోపాటుగా.. అందులోని పాత్రల్ని ఎంతో సహజంగా చూపించాలనే ఆలోచనతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. కథానాయకుడు సంజరుని ర్యాగింగ్‌ చేస్తుంటే.. కాలేజీలో తనకంటే సీనియర్‌ అయిన అనుపమ అతన్ని కాపాడడం, ఆ తర్వాత వారి మధ్య స్నేహం ఏర్పడడం చూస్తే మాములు లవ్‌స్టోరీ సినిమాల మాదిరిగానే ఈ చిత్రం ఉందనిపిస్తుంది. ఇక కాలేజీ నుంచి ఎంఎస్‌ కోసమని అనుపమ, సంజరులు లండన్‌కి వెళ్లడం.. అక్కడ ప్రేమించుకోవడం వంటి సన్నివేశాల్లో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. ఆ తర్వాత అనుపమ ఉద్యోగానికి అప్లై చేస్తే.. అది నచ్చక సంజరు కోప్పడడం.. ఈ సమయంలోనే సంజరుకి పూజ అనే అమ్మాయి దగ్గరవ్వడం అది గమనించిన అనుపమ అతనికి దూరమవ్వడం..ఎలాంటి ట్విస్టులు లేకుండానే విరామం వస్తుంది. ఇక సెకండాఫ్‌లో విడిపోయిన ప్రేమికులు.. వారి మధ్య జరిగే సంఘర్షణపైనే డైరెక్టర్‌ దృష్టి పెట్టాడు. అనుపమ లైఫ్‌లోకి గిరి (అవసరాల శ్రీనివాస్‌) రావడం కథనంలో వేగం పెరిగింది. కొన్ని ఎమోషనల్‌ సీన్లతో కథ ముగించిన తీరు బాగానే ఉంది. కానీ క్లైమాక్స్‌ ప్రేక్షకుడు ఊహించిందే కావడం మైనస్‌. అలాగే రొటీన్‌ లవ్‌స్టోరీ, సన్నివేశాల సాగదీతలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాయి. కథలో కొత్తదనం ఉంటే ఈ సినిమా మరోస్థాయిలో ఉండేది.

song


ఎవరెలా చేశారంటే..?
హీరో నాగశౌర్య ఆ పాత్రకి ప్రాణం పోశాడు. ఇక హీరోయిన్‌గా మాళవిక కూడా చక్కగా నటించారు. అతిథి పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ నటన బాగుంది. ఇక కళ్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్‌ కుమార్‌ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.