Jun 23,2022 07:21

చాలా మంది అనుకున్న పనులు ఉన్న సమయానికి పూర్తి చేయలేక పోతున్నారంటే, సమయపాలన ప్రణాళిక సరిగ్గా వేసుకుని ఉండరు. రకరకాల పనుల ఒత్తిడి మధ్య సతమతం అవడం కంటే ఉన్న కొద్ది సమయంలోనే ప్రణాళిక పట్టిక వేసుకుని, దాని ప్రకారం చేసుకుంటూ పోతే ఎటువంటి సమస్య ఎదురవ్వదు.
ఏ పనులు ఎప్పుడు ...
ఒకరోజు లేదా వారం లేదా పది రోజుల్లో పూర్తి చేయబోయే పనుల్ని ముందుగానే ఒక జాబితాగా రాసుకోండి. నిర్దేశించుకున్న సమయంలో ఏయే పనులు చేయాలి? వాటి కోసం ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలి? ఇలా వివరాలతో సహా డైరీలో రాసుకోవాలి. దాని ప్రకారం ఒకదాని తర్వాత మరొక పని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.
ప్రాధాన్యత ప్రకారం...
రాసుకున్న పనుల్లో ముఖ్యమైనవి, ముందు చేయాల్సినవి, నిదానంగా చేసుకునే పనులు ఉంటాయి. వాటి ప్రకారం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పనులు ఎంచుకోవాలి.అప్పుడే మీకు ఉన్న సమయంలో ఏ పనులు ఎప్పుడు పూర్తి చేయగలరో ఒక అవగాహన వస్తుంది.
ఏ పనికి ఎంత సమయం?
ఒక్కో పని గంట పడుతుంది. మరో పని నిమిషాలు పడుతుంది. దీని ప్రకారం ప్రణాళికలో సమయం కూడా చేర్చుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు ఉన్న సమయంలో ఎన్ని గంటలు ఆ పనికి కేటాయించగలమో తప్పకుండా చూసుకోవాలి.
సహాయం తీసుకోండి
అన్ని పనులు మీద వేసుకుని చేయాలంటే ఒత్తిడికి గురికాక తప్పదు. అప్పుడు ఆ పని చేయాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. దాంతో పనిలో నాణ్యత ఉండదు. కావున తప్పకుండా స్నేహితులు, సన్నిహితుల సహాయం తీసుకోండి. వారికి మీ పనిని వివరించి, దానికి వారు ఎంత సహాయపడగలరో తెలుసుకుని వారికి అప్పజెప్పండి.
విశ్రాంతి తప్పనిసరి
ఎన్ని పనులున్నా.. వాటికి ఎంత సమయం కేటాయించినా కాస్త సమయం మీ కోసం మీరు కేటాయించుకోవాలి. మీ మనుసుకు నచ్చిన సంగీతం, పాటలు, సినిమా చూడటం చేయాలి. మీకు ఇష్టమైన కుటుంబ సభ్యులను, స్నేహితులను కలిసి మాట్లాడుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.