
ప్రజాశక్తి -కర్నూలు కల్చరల్ : తెలుగుతోటలో మధురకవిగా చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న కవి ఆచార్య ఎం.బుద్దన్న శుక్రవారం ఉదయం ఆరుగంటల సమయంలో అనారోగ్యంతో మృతి చెందారు. తెలుగు కవిగా ఉర్దూ, పార్శీ భాషా సాహిత్యాలను అధ్యయనం చేసిన బహుభాషాకోవిదులు ఆచార్య బుద్దన్న... కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా వుప్పాలదొడ్డి గ్రామంలో 01.06.1955 లో ఎం.పెద్దయ్య, వీరమ్మ అనే నిరుపేద కూలీ దంపతులకు జన్మించారు. పేదరికంతో పోరాడుతూనే ఉన్నతవిద్యను చదువుకున్నారు. శివకవి యుగ వైశిష్ట్యం అనే అంశంపై ఆచార్య శలాక రఘునాథ శర్మ ఆధ్వర్యంలో పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. 1985 లో కళాశాల ఉపన్యాసకులుగా జీవితాన్ని ప్రారంభించిన బుద్ధన్న అనేక పదవులను చేపట్టారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా, ప్రత్యేకాధికారిగా, డీన్, సమన్వయకర్తగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్, పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షులుగా, ప్రధానాచార్యులుగా విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యులుగా పనిచేసిన ఘనత ఆయనకొక్కరికే దక్కింది. ఆచార్య బుద్ధన్న ఉర్దూ సాహిత్యంపై సుమారు 35 వ్యాసాలు రాశారు. ఇప్పటి వరకు 40 కు పైగా గ్రంథాలకు పీఠికలను, 30 మందికి పైగా పరిశోధకులకు పిహెచ్ఐలకు, 15 మందికి పైగా యంఫిల్ పట్టాలకు మార్గదర్శకత్వం వహించారు. ఉర్దూ సాహిత్య ప్రక్రియలైన గజల్, రుబాయిలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో సమర్పించారు. టిటిడి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మహాభారతం ప్రాజెక్టుకు సలహాదారుగా సేవలందించారు. అప్పటి అధికార భాషా సంఘం సభ్యులు పరచూరి గోపాలకఅష్ణ చేతులమీదుగా రాష్ట్ర పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈయన కవిత్వాన్ని మెచ్చుకొని అధికారికంగా సత్కరించారు. ఇప్పటి వరకు అక్షర వైజయంతిక, అంబేడ్కర్, ప్రభాతశోభ, ఉదయరాగము, స్మఅతి సూక్తము, విదురగళము, అనార్కలి, ప్రేమఋక్కులు, చీకటి, ఆత్మోపశమనము వంటి మహత్తర కావ్యాలు భారతీయ సాహిత్యానికి అందించారు. ఆయన అకాల మరణం సాహిత్యలోకానికి తీరని మరణం అంటూ కర్నూలు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసమూర్తి, ఆవులబసప్ప నగర అధ్యక్షకార్యదర్శులు అయ్యన్న ఆవులచక్రపాణియాదవ్ లు సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.