
'నేను నన్ను ప్రవాసం చేసిన భాషలో మాట్లాడుతున్నాను'
- అడోనిస్
'దేహమంతా పాదాలతో / నేను నడుస్తున్నాను
నాతో దేశం నడుస్తోంది / దేశం వెంట మరో దేశం
- ఈ అనంత యాత్రకు మొదలెప్పుడో చెప్పలేను'
రెక్కలు తప్ప ఆస్తులు లేని కష్టజీవులు, నిరుపేదలు, పొట్టకూటి కోసం ప్రవాసం వెళ్లడం ఈనాటిది కాదు. ఆది నుండీ ప్రవాసమున్నది. కాలమే ఈ అనంత యాత్రతో ప్రారంభమైంది. మానవజాతి గమనానికే ఇది మూలమైంది. అందుకే కవి ప్రసాదమూర్తి తన దీర్ఘకావ్యాన్ని ఈ ప్రవాస యానంతోనే మొదలుపెడుతున్నాడు. దేహాలను, కుటుంబాలను రెండు చేతులతో పొదివి పట్టుకుని పరుగులు తీస్తున్న వలస కార్మికుల ప్రవాస ప్రయాణంతోనే తన దుఃఖగీతిని ప్రారంభిస్తున్నాడు. 'తరమబడ్డ దేశాలనుండి / తరమబడ్డ జీవితాలనుండి / తిరగబడ్డ జీవితేచ్ఛ / పాదాలు తొడుక్కుని / పాదాలకు దేహాలు తొడుక్కుని / ..... / దేహాలను దేహాలతో పట్టుకుని / పరుగులు తీస్తున్న'... వలస కావ్యం రచిస్తున్నారు.
తెలుగులో కరోనా కాలం గురించి అనేక కవితలొచ్చాయి. ఒక దీర్ఘ కవిత (నందిని సిధారెడ్డి గారిది) కూడా వచ్చింది. ఐతే ప్రసాదమూర్తి ఒక భిన్న స్వరంతో మాట్లాడుతున్నాడు. ఒక భిన్న సన్నివేశాన్ని భిన్న తాత్వికతతో పట్టుకున్నారు. కరోనా లాక్ డౌన్ ప్రకటించినప్పుడు, హఠాత్తుగా కష్టజీవులను నగరాలు ఖాళీ చేయమని తాఖీదు జారీ చేసి బలవంతంగా వాళ్ళను స్వంత ఊర్లకు తరిమేసినప్పుడు, దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు. కాలప్రవాహంలో 'మార్చి 24, 2020' ఒక తారీఖే కావచ్చు కానీ, కోట్లాది శ్రమజీవులను వలస సర్ప పరిష్వంగంలో బంధించి, జీవితం కోసం, ప్రాణం కోసం, ఊపిరి కోసం తల్లడిల్లేటట్టు చేసిన దుర్మార్గ్మమైన రోజు అది. ఎందరెందరో ఊరూ పేరూ లేని అమాయకపు జీవులు, విరిచేసిన రెక్కలే ఆధారంగా బతుకునీడుస్తున్న వాళ్ళు దిక్కు తెలియని చోట్లకు కొట్టుకుపోయారు.
ప్రసాదమూర్తి తన కావ్యాన్ని కరోనా లాక్‌డౌన్ వలసల సందర్భంగా పలికిస్తున్నా, ఏనాడో మొదలైన, క్రీస్తుపూర్వం నుండి క్రీస్తు శకంలోకి ప్రవేశించిన మానవ ప్రవాస ప్రయాణాన్ని, లాక్‌డౌన్ అనే నిర్దిష్ట సన్నివేశం గురించి మాట్లాడుతూ సార్వజనీన చరిత్ర చేసాడు. 'పాదాలు తప్ప మరో అవయవం లేని / దేశం ఆత్మ నిర్భరతకు / అద్దం పట్టిన రహదారుల మీద / అందమైన ప్రణాళికల పూలతో / దేవుడూ సైతానూ జుగల్ బందీ / యుగాల కుట్ర' అని పేర్కొన్నారు.
ప్రతి వ్యవస్థలోనూ ఏదో ఒక రూపంలో ప్రవాసముంటుంది. వలసలుంటాయి. ప్రతి వ్యవస్థ దానికి పరిమితులూ, వాటిని దాటే మార్గాలూ నిర్మించుకుంటుంది. కరోనా తాకిడికి కుప్పకూలిన సామాజిక ఆర్థిక వ్యవస్థకు తనని కాపాడుకునే మార్గాన్ని శ్రమజీవులు నగర బహిష్కారం విధించడంతో వెతుక్కుంది. తనకే మూలమైన నగర వలస కార్మికులను ఆధునిక సురక్షిత నిర్మాణ వ్యవస్థలకు అవతల దూరంగా విసిరేసి, నగరాల్ని దాటించి, రోడ్ల పాలు చేసి, వందలాది కిలోమీటర్లను కాలినడకన నడిపించి వాళ్ళ పాడుబడ్డ పల్లెటూళ్లకు తరిమివేసింది. నాలుగు సింహాల అధికారం జూలు దులిపి క్రూరంగా దాడి చేసింది. శ్రమజీవులని స్థానభ్రంశం చేసి ప్రవాసం చేసి, రోడ్ల మీద దారుణంగా గాయపడ్డ దేహాలతో కాళ్ళీడ్చే వలస కార్మికుల్ని చేసి వాళ్ళ రూపాలనే మార్చేసింది. వాళ్ళ శవాలు అనామకమయ్యాయి. వాళ్ళ కుటుంబాలు అనాధలయ్యాయి. వాళ్ళకందరికీ ఒకే ఉనికి. వలస కార్మికులు. 'నగరాల్ని మోసి మోసి/ అలసిపోయిన దేశీ రెక్కలు / పాదాలని తొడుక్కుని పారిపోతున్న/ దిక్కులేని జనగీతాలు/ శూన్య జలపాతాలు' గా మారిపోయిన అసంఖ్యాక జనప్రవాహం.
వాళ్ళ గురించి కవి ప్రసాదమూర్తి తన కవిత్వంలో ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నారు. నిజంగా వాళ్లదేనా ఈ దేశం? నిజంగా వాళ్ళు తమ దేశానికే వెళ్తున్నారా? ప్రశ్నలే సమాధానాలు ప్రశ్నలకు 'మీకు అర్థం కాని వ్యర్థ అవయవాన్ని / ఏ దేశం రమ్మంటే ఆ దేశమే నాది', ఇదేనా మనమిచ్చే సమాధానం? కాదు. కాదని కవికి తెలుసు. అందుకే చరిత్ర శిథిలాలు తవ్వుతున్నాడు. ఈ వలసలకు అందమైన పేరు 'ఎక్సోడస్' అని పెట్టి మరీ ప్రశ్నిస్తున్నాడు. వాల్మీకి వారసుణ్ణయినా అణచివేతల ప్రస్థానాన్ని అశ్రుదగ్ధ కావ్యంగా మలచలేననీ, భిల్లుడిని దొంగగా మార్చిన అక్రమ చరిత్రనీ భీముని సంతానమైనా హిడింబి పుత్రుడిగానే గుర్తింపు పొందిన తనని తాను ఎన్నడో కోల్పోయానని ప్రకటిస్తున్నాడు. తమనుండి తాము కోల్పోయి, ఇతరులనుండీ కోల్పోయిన మనుషులు వలస కార్మికులు. రెండు ప్రవాసాల మధ్య బతుకుతున్న వారు. వదిలి వెళ్లిన సొంత ఊరే ప్రవాసంగా మారిన పరిస్థితి. రెండు నరకాల మధ్య బతుకుతున్న వారు. వారు వాళ్ళు కాదు. వాళ్ళకే పరాయి అయిపోయిన అస్తిత్వాలు. వాళ్ళ రెక్కల శ్రమ మీద నగరాలు నిలబడ్డా, ఆ నగరానికే పరాయైపోయిన అస్తిత్వహీనులు. అనామకులు.
కవికి వలస కార్మికుల చరిత్ర తెలుసు. వారి చరిత్ర తో ఐడెంటిఫై అయ్యే తన చరిత్రా తెలుసు. పురాణాలూ విస్మరించిన బహుజనుల చరిత్ర అది. మనుస్మ ృతి నిరాకరించిన శూద్రుల చరిత్ర అది. సమానత్వం సామాజిక న్యాయమూ కరువైన కోట్లాది భారతీయ బహుజన కష్టజీవుల చరిత్ర అది. అందుకే, 'నిండా పోగేస్తే / నాలుగు వేల సంవత్సరాల చరిత్ర / నాతో ఆడిన నాటకం ఇదంతా / నన్ను ధ్వంసించి హింసించి నిర్మించిన దివారాత్ర నిరంతర భ్రమణాలివి' అని గుర్తించాడు. అందుకే ఆ చరిత్రనే, ఆ చరిత్ర మూలాలనే ప్రశ్నిస్తున్నాడు. వందలాది కిలోమీటర్లు నడిచి, మట్టిగొట్టుకుపోయి నెత్తురోడి పగుళ్లు బారి గాయాలైన పాదాలతో ప్రశ్నిస్తున్నాడు. ఎవరి దగ్గరున్నాయి సమాధానాలు? మళ్ళీ కవే తానెవరో, తన పేరేమిటో, తన చరిత్ర ఏమిటో, తన గాథను తానే గానం చేస్తున్నాడు. ఆ గాథే, ఆ గానమే ఈ దీర్ఘకవిత.
కవి తానే వలస కార్మికుడై, తానే ప్రవాసియై మాట్లాడాడు. తానే వాళ్ళ పాదాలు అయ్యాడు. పదాలు అయ్యాడు. వాళ్ళ భాష అయ్యాడు. తన కవిత్వాన్ని వాళ్ళుగా చేసాడు. వాళ్లనే తన కవిత్వం చేసాడు. ఇది ప్రసాదమూర్తి ఈ కవితలో సాధించిన కొత్తదనం, విజయం.
'నేను అదనపు జనం లోని వాడిని / ఏ దేశానికీ అవసరం లేని వాడిని / అసలు దేశమే లేని వాడిని'; 'కాలం బంతిలా తంతుంటే / దేహాలను దేశాలకవతల గుడారాలుగా పాతుకుంటున్న/ కాందిశీకుల కళ్ళలో కత్తుల కన్నీటి వాన నాది./ నాఫ్ నదిలో రోహింగ్యా కళేబరాన్ని,/ ఆత్మకు సిఏఏ మొలతాడు / మెడలో ఎన్నార్సీ ఉరితాడు / ఇది నిరంతర లాక్‌డౌన్ / నాది అనంత వలస' నాది అనంతవలస అని చివరి వాక్యంగా రాసి కావ్యాన్ని ఓపెన్ ఎండెడ్‌గా వదిలివేయడంలో కవి ప్రతిభ తెలుస్తున్నది.
ఒక దీర్ఘ కావ్యం రాయడం సులభం కాదు. ఎంతో పరిశోధన ఉండాలి. సమస్య గురించి దాని లోతుల్లోకి, చరిత్ర లోకి లోతైన అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినంత మాత్రాన మంచి కవిత రాయలేడు కవి. అలా రాయాలంటే గొప్ప కవితా హృదయం ఉండాలి, కరిగిపోయే హృదయముండాలి. వస్తువుని కవిత్వం చేసే నైపుణ్యమూ, శిల్పం మీద పట్టు ఉండాలి. అన్నింటికీ మించి అనుభవాల్ని గాఢమైన అనుభూతులుగా వ్యక్తీకరించి కవిత్వీకరించే గొప్ప కవి హదయం ఉండాలి. సమస్య పట్ల వస్తువు పట్ల తాత్వికత ఉండాలి. ఇవన్నీ ప్రసాదమూర్తికి పుష్కలంగా ఉన్నాయి అనడానికి ఈ దీర్ఘ కవిత ఒక గొప్ప ఉదాహరణ. ఈ దీర్ఘ కవిత ఒక ఉద్వేగభరిత ప్రయాణం, ఒక దు:ఖభరిత ప్రయాణం. మనమూ వలస కార్మికులమౌతాం, మనమూ వారితో ప్రయాణిస్తాం. కవిత చదవడం అయిపోయేకల్లా మన పాదాల నిండా నెత్తురు, పగుళ్లు, గాయాలు. మన కళ్ళలోంచి ధారాపాతంగా కన్నీళ్లు ప్రవహిస్తాయి.
(ఇది ఈ దీర్ఘ కవిత ముందుమాటలోని కొన్ని భాగాల కూర్పు.
ఈ పుస్తకం ఫిబ్రవరి 12న విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో ఆవిష్కరణ అవుతుంది.)
- నారాయణస్వామి వెంకటయోగి
న్యూజెర్సీ, అమెరికా