Feb 01,2023 15:23

హవానా  :   అమెరికాలో పోలీసుల క్రూరత్వం అత్యంత తీవ్రమైన, క్రమపద్ధతిలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనగా క్యూబా విదేశాంగ మంత్రి మంగళవారం పేర్కొన్నారు. అమెరికాలో ప్రతి ఏడాది పోలీసుల క్రూరత్వానికి వెయ్యిమందికి పైగా మరణించడం ఆందోళన కలిగించే అంశమని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగజ్ ట్వీట్  చేశారు. అమెరికా మీడియా ప్రకారం 2020 మేలో ఆఫ్రికన్‌ - అమెరికన్‌ జార్జి ఫ్లోయిడ్‌, ఇటీవల టైర్‌ నికోలస్‌లు మరణించడం ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణగా పేర్కొన్నారు. అలాగే అమెరికాలోని కొందరు పోలీసులు జాత్యాహంకారం, హింసకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారని అన్నారు. ఇటీవల  టెనస్సీ రాష్ట్రంలో పోలీసు అధికారుల చేతుల్లో దారుణంగా దాడికి గురైన ఆఫ్రికన్‌ - అమెరికన్‌ టైర్‌ నికోలస్‌ చికిత్స పొందుతూ మూడు రోజుల అనంతరం మరణించిన సంగతి తెలిసిందే. నికోలస్‌ను నేలపై పడవేసి పోలీసులు లాఠీలతో, పిడిగుద్దులతో దాడి చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ దాడిపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.