
పారిస్ : మాక్రాన్ ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ వయసు పెంపుదల చట్టంకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పగలు, రాత్రీ అనే తేడా లేకుండా నిరసనలు చేపడుతున్నారు. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉన్న ప్లేస్ డి లా కాంకోర్డ్‌లో శుక్రవారం రాత్రి నిరసనకారులు గుమిగూడి అధ్యక్షుడు మాక్రాన్‌ను తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదేశంలో వేలాది మంది ప్రజలు పండుగ వాతావరణం తలపించేలా భోగి మంటలు వేశారు. నృత్యాలు చేశారు. దీంతో నిరసనకారులపై భాష్ప వాయువును పోలీసులు ప్రయోగించారు.
కాగా, నిరసనకారులు 2018లో జరిగిన 'ఎల్లో వెస్ట్ ప్రొటెస్ట్స్'లా అభివర్ణించారు. ఇక ప్రతి పది మందిలో ఎనిమిది మంది పదవీ విరమణ పెంపుకు వ్యతిరేకంగా ఉన్నారని, ఇక 65 శాతం మంది ప్రజలు నిరసనలు, సమ్మెలు కొనసాగాలని కోరుకుంటున్నారని రేడియో నెట్‌వర్క్ ఆర్‌టిఎల్ వెల్లడించింది. ఇక పదవీ విరమణ పెంపుకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మరిన్ని సమ్మెలకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.