Jun 23,2022 11:30

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి సామూహిక వినతి ఇవ్వాలని ప్రయత్నించిన టిటిడి అటవీ కార్మికులను యశోదానగర్‌లోని సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద గురువారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. ప్రదర్శనకు అనుమతి లేదని, వెళ్లడానికి వీలు లేదనడంతో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్మికులు యశోదానగర్‌ లోని రోడ్డుపై బైఠాయించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ బైఠాయింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వి. నాగరాజు, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్చార్జి వెంకటా చలపతి తదితరులు మాట్లాడుతూ.. టిటిడి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం అటవీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానం అమానవీయంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రిని శాంతియుతంగా కలవటానికి ప్రయత్నిస్తుంటే నేతల ఇళ్లు, కార్యాలయాల దగ్గర నిర్బంధించడం అన్యాయమని విమర్శించారు. ముఖ్యమంత్రి హామీకి, బోర్డు తీర్మానానికి, కోర్టు ఆదేశాలకే దిక్కు లేదంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. 587 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న పరిస్థితి పేద కార్మికులకు తలెత్తిందంటే కారకులు ఎవరని ప్రశ్నించారు. టిటిడిలో పనిచేస్తున్న అటవీ కార్మికులందరూ సచివాలయాల ద్వారా ముఖ్యమంత్రికి లేఖలు పంపాలని నిర్ణయించారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఈఓ ధర్మారెడ్డి అటవీ కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని టిటిడి యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని, పేద అటవీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి. బాలసుబ్రమణ్యం, నగర అధ్యక్ష, కార్యదర్శులు టి.సుబ్రహ్మణ్యం, ఆర్‌. లక్ష్మి, జిల్లా కార్యదర్శి పి.సాయి లక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాధవ్‌ సిఐటియు నేతలు చిన్నా, మల్లికార్జునరావు వేణుగోపాల్‌, జయంతి అటవీ కార్మికుల సంఘం నేతలు ఈశ్వర్‌ రెడ్డి, సురేష్‌, మల్లి, వెంకట్‌ రెడ్డి, వాసు, వేణుగోపాల్‌, కృష్ణ, శ్రీనివాసులు, క్రిష్ణమూర్తి, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.