Sep 30,2022 18:39

క్రియేటివ్‌ డైరెక్టర్‌ మణిరత్నం తీసిన చారిత్మ్రక చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌ -1'. ఈ చిత్రాన్ని కార్తీ, విక్రమ్‌, జయం రవి, త్రిష, ఐశ్వర్యరారు వంటి ప్రధాన తారాగణంతో తెరకెక్కించారు. మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టుగా చెప్పుకునే ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో తెలుసుకుందామా!

కథ
చోళరాజ్యాన్ని పాలించే సుందరచోళుడి (ప్రకాశ్‌రాజ్‌)కి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్‌), రెండవ కుమారుడు అరుళ్‌ మోళి, అలియాస్‌ పొన్నియన్‌ సెల్వన్‌ (జయం రవి). కుమార్తె కుందవై (త్రిష). ఇద్దరు కుమారులు రాజ్య విస్తరణలో భాగంగా సైన్యాన్ని తీసుకుని ఒక్కో దిక్కుకు వెళ్లి.. ఒక్కోరాజ్యాన్ని చేజిక్కించుకుంటారు. పొన్నియన్‌ సెల్వన్‌ శ్రీలంకలో.. ఆదిత్య కంచిలో రాజులుగా ఉంటారు. తన తర్వాత ఆ రాజ్యానికి వారసునిగా పెద్దకుమారుడు ఆదిత్య కరికాలుడని సుందర చోళుడు ప్రకటిస్తాడు. దీంతో అసలు సమస్య మొదలవుతుంది. ఆ రాజ్యానికి రాజుగా ఆదిత్యను కాకుండా.. సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు (రహమాన్‌)ను ఉంచాలని ఆ రాజ్య కోశాధికారి పళవేట్టురాయర్‌ (శరత్‌కుమార్‌) కలలు కంటాడు. ఆ రాజ్యంలో కుట్ర జరుగుతుందని గ్రహించిన ఆదిత్య... తన మిత్రుడైన వందియదేవన్‌ (కార్తి) తంజావూరికి పంపిస్తాడు. అలాగే రాజ్యంలో జరుగుతున్న కుట్రల్ని తెలుసుకున్న కుందవై.. వందియదేవన్‌ను.. శ్రీలంక నుంచి పొన్నియన్‌ సెల్వన్‌ను తీసుకురమ్మని పంపిస్తుంది. ఇది గ్రహంచిన పళయవేట్టూర్‌ పొన్నియన్‌ సెల్వన్‌ను ఖైదు చేసి తీసుకురండి అని సైన్యాన్ని పంపిస్తాడు. కోశాధికారి కుట్రలను ఆదిత్య, పొన్నియన్‌సెల్వన్‌లు ఎలా భగం చేశారు? ఇందులో వందియదేవన్‌ వీరికి ఎలా సహాయపడ్డాడు? నందిని (ఐశ్వర్యారారు)ఎవరు? సైన్యంతో కలిసి ఆమె రాజ్యానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

karti


విశ్లేషణ
ఈ సినిమా తమిళులకి అర్థమైనంతగా.. తెలుగువాళ్లకి అర్థం కాదు. ఎందుకంటే తెలుగువాళ్లకి కథలోని పేర్లు గుర్తుపెట్టుకోవడానికే చాలా సమయం పడుతుంది. తమిళులకు అయితే కల్కి రాసిన 'పొన్నియన్‌ సెల్వన్‌' నవలలు చదివి ఉంటారు గనుక సులభంగా కథలోని పాత్రలపైనా అవగాహన ఉంటుంది గనుక త్వరగా కథలో లీనమవుతారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఆదిత్య కరికాలుడిని చూపిస్తూ.. రాజ్య నేపథ్యాన్ని వివరస్తూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వందియదేవన్‌గా కార్తీ పరిచయం... ఆయన చతురత తెరపై నవ్వులు పూయిస్తుంది. రాజ్యవిస్తరణలో భాగంగా సోదరులిద్దరూ చెరో దిక్కుకు వెళ్లినా తండ్రి చెంతనే ఉంటున్న కందువై పాత్ర, ఆమె తెరపై కనిపించిన తీరు ఆకట్టుకుంది. రాజ్యంలో జరుగుతున్న కుట్రను రివీల్‌ చేస్తూ.. సెకండాఫ్‌పై అంచనాలను పెంచుతూ.. విరామం వస్తుంది. ఇక సెకండాఫ్‌లో పొన్నియన్‌సెల్వన్‌ పాత్రకే అధిక ప్రాధాన్యత ఉంది. అతను శ్రీలంక నుంచి తంజావూరుకు వచ్చే క్రమంలో పళవేట్టురాయర్‌ పంపిన సైన్యంతో జరిగే యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకున్నాయి. ఇక పతాక సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. ఇక ఆదిత్యకు నందినికి ఉన్న రిలేషన్‌ ఏంటనే దానిపై ఆసక్తిని కలిగిస్తూ పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌ -2పై అంచనాలు పెంచారు డైరెక్టర్‌ మణిరత్నం.
ఇద్దరు రాకుమారులు తన రాజ్యంలో జరుగుతున్న కుట్రలను చేధించి...తమ రాజ్యాన్ని కాపాడుకోవడం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే కల్కి రాసిన నవల ఉన్నంత ఉత్కంఠభరితంగా.. ఈ సినిమా అయితే లేదు. ఐదు భాగాలుగా ఉన్న నవలని.. కేవలం రెండు పార్ట్‌లలోనే తెరకెక్కించాలనే నియమంతో డైరెక్టర్‌ కత్తెరకు పనిచెప్పారనిపించింది. సమయం నిడివి తక్కువగా ఉండడం వల్ల ప్రాధాన్యమైన పాత్రలు తెరపై అలా వచ్చి వెళుతుంటాయి. దీంతో ఆ పాత్రలు మైండ్‌లో రిజస్టర్‌ కావు. ఇక యుద్ధ సన్నివేశాల్ని చూస్తే... 'బాహుబలి'లా లేవే ఈ యాక్షన్‌ సీన్స్‌ అనేలా ఉన్నాయి. అయితే నటనానుభవం ఉన్న ఎందరో నటీనటుల్ని మణిరత్నం సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇక సాంకేతికంగా కూడా అంత ఉన్నతస్థాయిలో లేదు. డైరెక్టర్‌ మణిరత్నం.. కథాకథనాల్ని అందరికీ అర్థమయ్యేలా నడిపించి, కొన్ని ట్విస్ట్‌లు, మరికొంత టెక్నికల్‌ వాల్యూస్‌ను జోడించినట్లైతే ఈ చిత్రం వేరే లెవల్లో ఉండేది.

ps


ఎవరెలా చేశారంటే
ప్రథమార్థంలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే.. కార్తీ నటన గురించే. ఇందులో కార్తీ నటనే హైలెట్‌గా నిలిచింది. ఇక విక్రమ్‌ తెరపై కొద్దిసేపు కనిపించినా ఆకట్టుకునేలా ఉంది. జయం రవి నటన బాగుంది. త్రిష, ఐశ్వర్యారారు నటన హైలెట్‌. శరత్‌కుమార్‌, ప్రకాశ్‌రాజ్‌ వారి నటనానుభవాన్ని తెరపై చూపించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఏఆర్‌రెహమాన్‌ సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

vikram