
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బేవరేజస్ హమాలీలకు ఎగుమతి కూలీరేట్లు పెంచాలని, పని భద్రత, పిఎఫ్, ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎపిఎస్బిసిఎల్ అండ్ ఐఎంఎఫ్ఎల్ జెఎసి ఆధ్వర్యంలో గురువారం చలో ఎమ్‌డి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ప్రసాదంపాడులోని శ్రీశక్తి కల్యాణమండపం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఆర్వి నరసింహారావు, ఎఐటియుసి నాయకులు వెంకటసుబ్బయ్య మట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి హమాలీలకు ఎగుమతి కూలీరేట్లు ఒక పెట్టుకు రూ.3 పెంచాలని కోరారు. గత వేతన ఒప్పందం కాలపరిమితి ముగిసి 14 నెలలు గడుస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ స్పందించకపోవడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి డిపోలనే నమ్ముకుని బతుకుతున్న హమాలీలకు పిఎఫ్, ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని పేర్కొన్నారు. నాయకులు ఎస్.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా కూలీరేట్లు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మదన్మోహన్, ఎల్.లోకేష్, వైఎస్‌ఆర్‌టియు నాయకులు రమణ తదితరులు మాట్లాడారు. దీనికి స్పందించిన డిజిఎం కృష్ణ ధర్నా వద్దకు వచ్చి మాట్లాడారు. ఈనెల 15వ తేదీన కాంట్రాక్టు సంస్థయిన సిగ్మాతో ఎపిబిసిఎల్ కార్యాలయంలో జాయిట్ మీటింగు ఏర్పాటు చేస్తామని హమీనిచ్చారు.