Jun 23,2022 21:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :బొగ్గు కొరత కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటలు పగటిపూట సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అధికారులతో మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రానున్న జులై, అక్టోబర్‌ మధ్యకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ 6శాతం పెరగనుందని విద్యుత్‌ సంస్థలు అంచనా వేసినట్లు విద్యుత్‌ అధికారులు చెప్పారు. ఈ కాలంలో రోజుకు 500 మెగావాట్ల నుంచి 1500 మెగావాట్ల మధ్య విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు షార్ట్‌ టర్మ్‌ టెండర్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ నెల 28తో టెండర్‌ ప్రక్రియ పూర్తికానుందని వివరించారు. రాష్ట్రంలో జులై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నెలవారీ డిమాండ్‌ 5684 మిలియన్‌ యూనిట్లు(ఎంయు), 6517 ఎంయు, 6071ఎంయు, 6224 ఎంయు ఉంచవచ్చని అంచనా వేశారు. బగ్గు కొరత వల్ల వర్షాకాలంలో పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌ను అందుకునే స్థితిలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు లేవని అధికారులు తెలిపారు. బగ్గు ఉత్పత్తి సామర్థ్యంలో సగం మాత్రమే బగ్గు ఉత్పత్తి జరుగుతున్నందు వల్ల థర్మల్‌ ప్లాంట్లలో తగినంత బగ్గు నిల్వలు ఉంచడం కష్టతరమయ్యే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. రాష్ట్రానికి బగ్గు సరఫరా పెంచుకునేందుకు కేంద్ర బగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ ట్రాన్స్‌కో సిఎండి బి శ్రీధర్‌తో కలిసి మంత్రికి వివరించారు. ప్రతిపాదిత థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు, పవర్‌ నెట్‌వర్క్‌ పటిష్టత కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు విద్యుత్‌ సంస్థలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయని వివరించారు. జూన్‌ 22న డిమాండ్‌ 188.04 ఎంయులుగా ఉందని, అందులో మార్కెట్‌ నుంచి 27.11 ఎంయులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌ జెఎండి ఐ పృధ్వీతేజ్‌, డిస్కంల సిఎండిలు హెచ్‌ హరనాథరావు, జె పద్మా జనార్ధన రెడ్డి, కె సంతోషరావు, ట్రాన్స్‌కో గ్రిడ్‌ డైరెక్టర్‌ ఎవికె భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.