Aug 05,2022 13:48

విజయవాడ : ప్రజాశక్తి 42 వ వార్షికోత్సవ సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాశక్తి ఫొటో ఎగ్జిబిషన్‌ చూపరులందరికీ మరింత సమాచారాన్నిచ్చింది. సభ ప్రారంభానికి ముందుగా ప్రజానాట్యమండలి గానాలాపన చేసి వీనులవిందు చేసింది. అనంతరం ప్రజాశక్తి సాహితీ సంస్థ తయారుచేసిన ప్రజాశక్తి ప్రస్థానం డాక్యుమెంటరీ వీడియోని ప్రదర్శించారు. 42వ వార్షికోత్సవ ప్రజాశక్తి ప్రత్యేక సంచికను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. కేరళ మంత్రి పి.రాజీవ్‌ గురించిన పరిచయాన్ని ప్రజాశక్తి హెచ్‌ఆర్‌.జనరల్‌ మేనేజర్‌ తోడర్‌మల్‌ వివరించారు. అనంతరం మంత్రి పి.రాజీవ్‌ వీడియోకాల్‌ ద్వారా మాట్లాడారు.

ప్రజాశక్తి పత్రిక మాదిరిగానే కేరళలోని దేశాభిమాని పత్రికను గురించి మంత్రి వివరించారు. గడిచిన 8 దశాబ్దాల కాలంగా పన్నెండున్నర లక్షలున్న పత్రికను రోజూ చదువుతున్నానని తెలిపారు. దేశాభిమాని పత్రికకు తాను కొంతకాలం ఎడిటర్‌గానూ పనిచేశానన్నారు. ప్రజాశక్తి మాజీ ఎడిటర్‌ ఎంవిఎస్‌.శర్మ, తాను కలిసి పారిస్‌ అంతర్జాతీయ సదస్సుకు వెళ్లిన సంగతులను గుర్తు చేసుకున్నారు. పత్రికా రంగం అన్నది భారత ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభంగా అభివర్ణించారు. కానీ ఇప్పుడు పత్రికా రంగం సక్రమమైన పరిస్థితుల్లో పనిచేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎగ్జిక్యూటివ్‌ మీడియాగా ఈరోజు పత్రిక రూపొందుతుందని అన్నారు. ఒక్క మీడియాలోనే కాకుండా ప్రధాన మూలస్తంభాలైన మూడింటిలోనూ ఎగ్జిక్యూటివ్‌ లక్షణాలే వ్యక్తమవుతున్నాయని అన్నారు. పార్లమెంట్‌కు, శాసనసభకు ఎన్నికైన సభ్యులకు మాట్లాడటానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. జ్యుడీషియర్‌ కూడా ఒక ఎగ్జిక్యూటివ్‌ జ్యుడీషియర్‌గా రూపొందుతుందని అన్నారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి సమయంలో నాలుగు మూలస్తంభాలైన మీడియావర్గానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సవాలేనన్నారు. మనదేశంలోని ఫెడరల్‌ స్ట్రక్చర్‌కు ముప్పు ఏర్పడుతుందని మంత్రి హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛ గురించి రాజ్యంగ సభలో జరిగిన చర్చ ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు సోమనాథ్‌ లహరి చేసిన వాదనను ఉటంకించారు. పత్రికా స్వేచ్ఛ గురించి కమ్యూనిస్టులు ఒక ప్రత్యేకతను ఆనాటి నుండి చెబుతూనే ఉన్నారని అన్నారు. గవర్నర్‌ అనేవారు అలంకారప్రాయమేనన్నారు. తమ విచక్షణాధికారాన్ని, తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పేందుకు వీల్లేదని, కచ్చితంగా మధ్యవర్గం అందించే సూచనల ప్రకారం ఆ గవర్నర్‌ నడుచుకోవాలంటూ.. అంబేద్కర్‌ చెప్పిన విషయాన్ని, రాజ్యాంగ సభలో ఆ విషయమై చర్చించిన తీరును చెప్పారు. రాజ్యాంగ పీఠిక విషయాన్ని చర్చించారు. భారతీయులమైన మేము అనే రాజ్యాంగంలో చేసే ప్రమాణానికి బదులుగా, భగవంతుడి పేరు మీద సవరణ చేయడంపై వివరించారు. రాజ్యాంగం రూపొందించిన రోజుల నుండి మతతత్వ భావన ఉందని చెప్పారు. మన దేశ మౌలిక ప్రధానాంశాలైన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, సార్వభౌమతం, స్వేచ్ఛలపై పెద్ద దాడి జరుగుతుందని, ఆ దాడిని ప్రతిఘటించే కృషిలో ప్రతీ భారతీయుడు భాగస్వామ్యం కావాలని, ఆ భాగస్వామ్యంలో ప్రజాశక్తి ఇప్పటివరకు చేసిన కృషిని మరింత కొనసాగించాలని మంత్రి పి.రాజీవ్‌ ఆశించారు.