Aug 05,2022 12:37

విజయవాడ : ప్రజాశక్తి 42 వ వార్షికోత్సవ సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాశక్తి ఫొటో ఎగ్జిబిషన్‌ చూపరులందరికీ మరింత సమాచారాన్నిచ్చింది. సభ ప్రారంభానికి ముందుగా ప్రజానాట్యమండలి గానాలాపన చేసి వీనులవిందు చేసింది. అనంతరం ప్రజాశక్తి సాహితీ సంస్థ తయారుచేసిన ప్రజాశక్తి ప్రస్థానం డాక్యుమెంటరీ వీడియోని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేరళ పరిశ్రమలు, వాణిజ్య శాఖామంత్రి పి.రాజీవ్‌ రావల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయితే ఆన్‌లైన్‌లో మంత్రి మాట్లాడనున్నారు. సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రావల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు.

సభాధ్యక్షులు, ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాస్‌ మాట్లాడుతూ ... 1981 ఆగష్టు 1 న ప్రజాశక్తి దినపత్రికగా ఆవిర్భవించిందన్నారు. అప్పటి నుండి అప్రతిహితంగా పత్రికను పాఠకులు ఆదరించి ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. ప్రజాశక్తి మార్గదర్శకుల విధానాలతో మిగిలిన పత్రికల కంటే భిన్నంగా ప్రత్యామ్నాయ జర్నలిజాన్ని, ' ప్రతి అక్షరం - ప్రజల పక్షం ' అనే నినాదాన్ని సంపూర్ణంగా అమలు చేసే విధంగా పత్రిక నిర్వహణ జరుగుతోందన్నారు. దీనంతటికీ ఆనాడు పడిన పునాదే ముఖ్యమన్నారు. మూలాల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ పత్రిక ముందుకు కొనసాగుతోందన్నారు. 1981 లో మహనీయులు పుచ్చలపల్లి సుందరయ్య చొరవతో ఆ రోజు దినపత్రిక వచ్చిందని గుర్తు చేశారు. ఆ చొరవకు ఆనాటి కమిటీలన్నీ సహకారమందించాయని, మోటూరు హనుమంతరావు వ్యవస్థాపక ఎడిటర్‌గా, సవ్యసాచిగా.. ఉపన్యాసకుడిగా, పార్లమెంటు సభ్యునిగా, ప్రజారంగంలో, నిర్మాణ బాధ్యతల్లోనూ ఏకకాలంలో సమర్థవంతమైన నాయకులుగా పనిచేశారని గుర్తు చేశారు. పత్రిక ప్రారంభంలో.. విజయవాడలోనే అఖిలపక్ష రైతు మహా ఉద్యమం సాగిందని, ఆ ఉద్యమంలోనే గుర్రం గోవిందు అనే వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించారని చెప్పారు. ఆ సందర్భాన్ని ఉన్న వాస్తవాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతూ, ప్రభుత్వ విధానాలను పూర్తిగా ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాశక్తి పూర్తి సమచారమిచ్చిందని వివరించారు. ప్రారంభంలోనే అలాంటి గొప్ప పని చేపట్టిన ప్రజాశక్తి తదనంతరం కూడా ప్రజల తరుపున నిలబడి పనిచేసిందన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలను వివరిస్తూ.. రాబోతున్న విపత్తులను మొట్టమొదట హెచ్చరించిన తెలుగు దినపత్రిక 'ప్రజాశక్తి' అని ఉద్ఘాటించారు. ప్రభుత్వ విధానాలకు-జనజీవనానికి మధ్య ఉన్న తారతమ్యాలను అర్థమయ్యేలా వివరించిదన్నారు. 90 వ దశకం నుండి నేటివరకూ ప్రజా ఉద్యమంలో ప్రజాశక్తి గొప్ప ప్రచార సాధనంగా నిలబడిందన్నారు. ప్రజా ఉద్యమాలన్నిటిలోనూ ప్రజాశక్తి అంతర్భాగంగా పనిచేసి ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించిందన్నారు. కేవలం రాజకీయ విధానాలే కాకుండా మిగతా అంశాలన్నీ.. ముఖ్యంగా మహిళల కీలక పాత్రల గురించి, యువతీ యువకులకు సంబంధించిన మెటీరియల్‌ను మొట్టమొదట తెచ్చింది ప్రజాశక్తేనని అన్నారు.
     దేశంలో మతోన్మాదం వెల్లువలా వచ్చినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం గురించి పెద్దఎత్తున ప్రచార సంచికలను ప్రజాశక్తి తెచ్చిందన్నారు. ఆ ఒరవడినే తదనంతర కాలంలోనే కొనసాగించామన్నారు. ప్రజలను చైతన్యపరిచిన పత్రిక ప్రజాశక్తి అని చెప్పారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆందోళనల్లోనూ ప్రజాశక్తి ప్రత్యేక పాత్ర వహించిందన్నారు. ప్రజాశక్తి ప్రత్యేక సంచికలు ప్రత్యేక సాధనాలుగా ఉపయోగపడ్డాయన్నారు. పాఠకుల నుండి వచ్చే ఆదరణే పత్రికను ముందుకు నడిపిస్తుందన్నారు. ప్రకటనకర్తలు, శ్రేయోభిలాషుల తోడ్పాటు ప్రజాశక్తి పెరుగుదలకు ఉపయోగపడిందని తులసీదాస్‌ పేర్కొన్నారు.