Jul 03,2022 18:13

అంగవైకల్యం అనేది శరీరానికే. అది మనిషిలో ఉన్న ప్రతిభకు కాదు అని నిరూపించారు కన్మణి. జన్యులోపంతో పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినా కాళ్లే చేతులుగా మలుచుకుని చదువులోనూ, పెయింటింగ్‌లోనూ ఫస్ట్‌ నిలిచారు. గొంతు సవరించుకుంటూ సంగీత సాగర సాధనతో అందర్నీ అబ్బురపరిచేలా గానం చేసి మొదటి ర్యాంకు సాధించారు.

కేరళకు చెందిన కన్మణి వైకల్య లోపం ఉన్నా అందరిలా అన్ని పనులూ చేయగలదు. తన మీద తనకు నమ్మకం కలిగించేలా తన చుట్టూ ఆ విధమైన వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించారు. అలప్పుజా జిల్లాకు చెందిన రేఖ, శశికుమార్‌ల మొదటి సంతానం కన్మణి. శశికుమార్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మొదట కన్మణి పుట్టుకను చూసిన తల్లిదండ్రులకు గుండె ఆగినంత పని అయ్యింది. చాలా రోజులు తల్లడిల్లిపోయారు. చేతులు లేవు. ఎడమకాలు కన్నా కుడికాలు చాలా చిన్నది. అయినా ఆమెను వదులుకోలేదు. పెంచుకునేందుకు సిద్ధపడ్డారు తల్లి రేఖ. కాళ్లతోనే అన్ని పనులు చేసుకునేలా చిన్నప్పటి నుంచి నేర్పించారు. తల దువ్వుకోవడం, బట్టలు వేసుకోవడం, తినడం ఇలా అన్ని పనులు కాళ్ల సహాయంతో తాను చేసుకోగలదు.

jeevana, chinnari,  main  story

బిడ్డలా చూసుకున్న టీచర్లు
ఇలాంటి లోపం ఉన్న పిల్ల సాధారణ స్కూల్లో వేస్తే మంచదని రేఖ బంధువులు, స్నేహితులు సలహా ఇచ్చారు. కాని రేఖ మాత్రం మామూలు స్కూల్లోనే కన్మణిని చేర్పించారు. మొదట చాలా స్కూళ్లు కన్మణిని చేర్చుకునేందుకు నిరాకరించాయి. దాంతో తామరా కులంలోని వివిహెచ్‌ పాఠశాల్లో ఆమెను చేర్చారు. ఆ స్కూలు యాజమాన్యం ఆమెకు ప్రత్యేకమైన వసతులు కల్పించింది. క్లాస్‌రూమ్‌లో కన్మణి మానసికంగా ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా ఉపాధ్యాయ బృందం సహకరించారు. కన్మణి కాలుతో రాయడం వల్ల సమయం ఎక్కువ పట్టేది. ఆమె పాఠాలు రాసుకునేంత వరకు టీచర్లు వేచి ఉండేవారు. ఇంటి దగ్గర నుంచి స్కూలుకు పది కిలో మీటర్ల దూరం. దాంతో కన్మణి తీసుకుని వెళ్లేందుకు బిందు అనే టీచర్‌ ప్రతిరోజూ ఇంటికి వచ్చేది. ఆమెను స్కూటీమీద తీసుకుని వెళ్లేవారు. లోలమ్మ అనే మరో టీచర్‌ కన్మణికి కాలి మధ్యలో రంగుల పెన్సిళ్లు, పెన్నులు పెట్టి పెయింటింగ్‌, డ్రాయింగ్‌ నేర్పించారు.

jeevana, chinnari,  main  story

కన్మణి మానసికానందం కోసం ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి, పెయింగ్‌లో శిక్షణ ఇచ్చారు. లోలమ్మ టీచర్‌ ప్రోత్సాహంతో కన్మోణి ప్రకృతి అందాలతో కూడిన బొమ్మలను చాలా వేసింది. కన్మణి కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకమైన సీటు సిద్ధం చేసి ఉంచారు. ఆమె క్లాసు మారినప్పడల్లా దాన్ని ఆ రూమ్‌లో ఉంచేవారు. తోటి పిల్లలు కన్మణితో ఎంతో ప్రేమగా మెలిగేవారు. తోటి పిల్లల్ని చూసి ఎప్పుడూ కన్మణి బాధపడలేదు. ఆమె దృష్టి అంతా చదువు మీదే ఉంచేది. ఆట, పాటల్లోనూ విద్యార్థులు, స్నేహితులతో కలిసి ఆడుకునేది. ఆటల పోటీల్లో పలు బహుమతులు సాధించింది కూడా! చదువులో ఉత్సాహంగా ఉంటూ క్లాసు ఫస్టు వచ్చేది. 12 ఏళ్ల వయసులోనే కీబోర్డు మీద తాను చదువుకున్న పద్యాలను, గీతాలను పలికించేది. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే ఒక లక్ష్యం పెట్టుకొని సాధించే దిశగా సాగుతోంది కన్మణి.
 

పెయింటింగ్‌, సంగీతంలో పట్టు
సంగీతం అంటే ఇష్టం ఉన్న కన్మణి చదువు తర్వాత పట్టుదలగా సంగీత సాధన చేసేది. తల్లి రేఖ కూతురు సంతోషం కోసం వెన్నంటే ఉండేది. సమయం దొరికినప్పుడల్లా కాళ్లతో కొన్ని వందల పెయింట్స్‌ వేసి, జనాన్ని ఆకర్షించేది. డ్రాయింగ్‌, పెయింట్స్‌లో ఆమె ప్రతిభను చూసి కేంద్ర సామాజిక న్యాయం- సాధికారత మంత్రిత్వ శాఖ ఆమెకు అత్యుత్తమ సృజనాత్మకత అవార్డును అందజేసింది. కరోనా కాలంలో పెయింట్స్‌, ఫ్యాషన్‌ డిజైన్స్‌ చేసింది. కంప్యూటర్‌, ఫోన్‌ ఉపయోగించి పెయింటింగ్స్‌ను సోషల్‌ మీడియాలో పెట్టింది. కొందరు వాటిని కొనుగోలు చేశారు. కన్మణి చిన్నప్పటి నుంచి అంగవైకల్యం ఉన్న వ్యక్తుల జీవిత కథల పుస్తకాలను చదువుతూ పెరిగింది. ఇంటర్‌ పూర్తయ్యాక తిరువనంతపురంలోని స్వాతి తిరునల్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో బిపిఎ కోర్సులో చేరింది. ఈ ఏడాది మాస్టర్స్‌ డిగ్రీని పూర్తి చేసింది. కేరళ విశ్వవిద్యాలయం నుంచి 82 శాతం మార్కులతో బ్యాచిలర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (గాత్రం)లో మొదటి ర్యాంకు సాధించి ఎందులోనూ తాను తక్కువ కాదు అని నిరూపించింది.