
తెలంగాణ: ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పెళ్లికి ముందు జీవిత భాగస్వామితో కలిసి ఓ వీడియోను షూట్ చేసి.. దానినే ఆహ్వానంగా బంధువులకు, మిత్రులకు షేర్ చేస్తున్నారు. అయితే, త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ఇద్దరు తెలంగాణ పోలీసు అధికారుల ప్రీ వెడ్డింగ్ షూట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కాబోయే భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే కావడంతో దానిని ప్రతిబింబించేలా ప్రీ వెడ్డింగ్ షఉట్ చేశారు. దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. పోలీస్ యూనిఫామ్‌ను సొంత అవసరాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు వినిపించాయి. కొందరు మాత్రం వారిని వెనకేసుకొచ్చారు. దీనిపై తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు.ఆ వీడియోను రీ ట్వీట్ చేస్తూ... '' దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. నిజానికి, పెళ్లి చేసుకోబోతున్నామన్న ఆనందంలో వారిద్దరూ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. గొప్ప విషయమే కావొచ్చు.. కానీ, కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. పోలీసు ఉద్యోగం చాలా చాలా కష్టమైన పని.. ప్రత్యేకించి మహిళలకు ఇంకా కష్టం. ఇద్దరు పోలీసు అధికారులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వడం కచ్చితంగా సంతోషించాల్సిన విషయమే. వారిద్దరూ ప్రీ వెడ్డింగ్ షఉట్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్ దుస్తుల్ని, చిహ్నాలను ఉపయోగించడాన్ని నేను తప్పుబట్టడం లేదు. కానీ, వారు ముందే మా అనుమతి కోరితే కచ్చితంగా అనుమతించే వాళ్లం. వాళ్లు చేసిన పని మనలో కొందరికి ఆగ్రహం తెప్పించి ఉండొచ్చు. వాళ్లు నన్ను పెళ్లికి పిలవక పోయినా, వెళ్లి వారిద్దరినీ ఆశీర్వదించాలని ఉంది.'' అని రాసుకొచ్చారు. అయితే, కచ్చితమైన అనుమతి తీసుకోకుండా ఇంకెవరూ ఇలాంటి పని చేయొద్దని సున్నితంగా హెచ్చరించారు.