Oct 02,2022 14:06

న్యూఢిల్లీ :  గాంధీజీ 153వ జయంతి వేడుకలు, శాస్త్రీజీ 118వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విలువలైన శాంతి, సమానత్వం, మత సామరస్యానికి మనల్ని మనం పునరంకితం చేసుకోవడానికి ఆయన జయంతి ఒక సందర్భం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము   పేర్కొన్నారు.  మహాత్ముడి 153వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో ఆమె నివాళులర్పించారు. మరో ప్రముఖ నేత, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రికి సైతం విజరు ఘాట్‌లో రాష్ట్రపతి నివాళులర్పించారు. ఆయన ఆదర్శాలు ఇప్పటికీ మనందరిలో స్ఫూర్తి నింపుతాయని ముర్ము అన్నారు. 
ప్రధాని కూడా  మహాత్మా గాంధీకి,  మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రికి  నివాళులర్పించారు. గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా జీవించాలని ప్రజలకు సూచించారు.  ప్రధాని  ఇచ్చిన ట్వీట్‌లో, ఢిల్లీలోని ప్రధాన మంత్రి సంగ్రహాలయంలో ఉన్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి గ్యాలరీలోని కొన్ని అంశాలను పోస్ట్‌ చేశారు.    శాస్త్రి గారు ప్రధాన మంత్రిగా సాధించిన విజయాలకు ఈ గ్యాలరీ సాక్ష్యంగా నిలుస్తుందని, ఈ సంగ్రహాలయాన్ని అందరూ చూడాలని పిలుపునిచ్చారు. 
గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంకర్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రులు తదితరులు నివాళులర్పించారు.

  pm modi,  Draupadi Murmu



  pm modi,  Draupadi Murmu