Jan 29,2023 20:13

ఢిల్లీ: ఓవైపు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు బలపడుతున్నాయి. మరోవైపు అధిక ధరలతో సామాన్యులు అతలాకుతలమవుతున్నారు. పెరిగిన వడ్డీరేట్లు నెలవారీ వాయిదాల రూపంలో భారంగా పరిణమించాయి. సరిగ్గా ఈ తరుణంలో ఉద్యోగాల కోత గుబులు పుట్టిస్తోంది. ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది.దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు పెరుగుతున్న ద్రవ్యోల్బణంపైనే ఆందోళన వ్యక్తం చేసినట్లు డేటా అండ్‌ అనలిటిక్స్‌ కంపెనీ క్యాంటార్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. సగటు వేతన జీవితో పోలిస్తే ఈ భయం సంపన్న వర్గాల్లోనే అధికంగా ఉందని సర్వేలో తేలింది. మొత్తం 1892 మంది ఈ సర్వేలో పాల్గన్నారు. వీరిలో సగటు వేతన జీవి నుంచి వ్యాపారవేత్తల వరకు అన్ని వర్గాల వారు ఉన్నారు.ఆదాయ పన్ను విషయంలోనూ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సర్వేలో పాల్గన్నవారు అన్నారు. కనీస పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని అత్యధిక మంది కోరారు. మరోవైపు 30 శాతం గరిష్ఠ పన్నురేటు శ్లాబును రూ. 10 లక్షల నుంచి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సెక్షన్‌ 80సీ కింద ఇస్తున్న మినహాయింపుల పరిమితిని సైతం పెంచాలని సూచించారు. వైద్య ఖర్చులు భారీగా పెరిగి కుటుంబ బడ్జెట్‌కు భారమవుతున్న నేపథ్యంలో జీవిత, ఆరోగ్య బీమాల ప్రీమియంలపై పన్ను రాయితీ ఇవ్వాలని సర్వేలో పాల్గన్న సామాన్యులు కోరారు. ముఖ్యంగా వేతన జీవులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా అడపాదడపా పలకరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య రంగంపై ప్రధానంగా దఅష్టి సారించాల్సిన అసవరం ఉందని పేర్కొన్నారు.