Aug 19,2022 07:34

*మంచి కంటే చెడే ఎక్కువ
* రిజర్వుబ్యాంకు బులిటెన్‌లో వెల్లడి
న్యూఢిల్లీ :
ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)లను ప్రయివేటీకరించడం ప్రమాదకరమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) సిబ్బంది నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు ఆర్‌బిఐ బులిటెన్‌లో ఒక కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం..ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణ విధానం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగనుందని ఆందోళన వ్యక్తం చేసింది. మోడీ ప్రభుత్వం రెండు, మూడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను మాత్రమే కొనసాగించి.. మిగితా వాటిని ప్రయివేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఆర్‌బిఐ పరోక్షంగా సూచించింది. ''ప్రయివేటు రంగ బ్యాంక్‌ (పివిబి)లు అధిక సామర్థ్యాంతో లాభాలను మాత్రమే గడిస్తున్నాయి. అదే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడంలో మెరుగ్గా పని చేస్తున్నాయి.'' అని ఆర్‌బిఐ బులిటెన్‌ పేర్కొంది.
'' ప్రయివేటీకరణ అనేది కొత్త విషయమేమీ కాదు. దాని లాభాలు, నష్టాలు బాగా తెలుసు. ఈ పద్దతిలో ఆర్థిక ఆలోచనలు దానిని అనుసరించేటప్పుడు మరింత సూక్ష్మమైన విధానం అవసరం. ప్రయివేటీకరణను అందిపుచ్చుకోవడం ద్వారా ఆర్థిక సాధికారత (ఫైనాన్సీయల్‌ ఇంక్లూజన్‌), ద్రవ్య బదిలీని పూర్తిగా చేరుకోలేము. బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌, యూరోపియన్‌ తదితర దేశాల ప్రగతిలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు కీలక పాత్ర పోశించాయి. ఆయా దేశాల్లో తక్కువ కార్బన్‌ పరిశ్రమలకు ఆర్థిక పెట్టుబడులను ప్రోత్సహించాయి.'' అని ఆ కథనం గుర్తు చేసింది.
కరోనా సంక్షోభాన్ని అధిగమించాయి..
       ''ప్రయివేటు బ్యాంక్‌లతో పోల్చితే పిఎస్‌బిలు లాభాలు మాత్రమే లక్ష్యంగా కాకుండా ఆర్థిక సాధికారత కోసం పని చేశాయని ఆధారాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు గత కొన్నెళ్ల కాలంలో రుణాల జారీలో మెరుగైన మార్కెట్‌ విశ్వాసాన్ని పొందాయి. బలహీనమైన బ్యాలెన్స్‌ షీట్‌లపై విమర్శలు ఉన్నప్పటికీ, అవి కోవిడ్‌-19 కరోనా సంక్షోభాన్ని అద్భుతంగా ఎదుర్కొన్నాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.'' అని ఈ రిపోర్ట్‌ పేర్కొంది. మోడీ సర్కార్‌ 2020లో 10 పిఎస్‌బిలను నాలుగు బ్యాంక్‌లుగా విలీనం చేసింది. 2017లో దేశంలో 27 పిఎస్‌బిలు ఉండగా.. పలు విలీనాల ద్వారా ఇప్పుడు వీటిని డజన్‌కు చేర్చిన విషయం తెలిసిందే. నిరర్థక ఆస్తులను నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఎఆర్‌సిఎల్‌)కు అప్పగించడం ద్వారా బ్యాంక్‌ల బ్యాలెన్ష్‌ షీట్లలోని మొండి బాకీల భారం తగ్గుతుందని ఆర్‌బిఐ పేర్కొంది. ఈ సంస్కరణలు పిఎస్‌బిలను మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొంది.