
మహిళలు గతంలో రుతుస్రావం సమయంలో ఇంట్లోని పాత వస్త్రాలను వినియోగించేవారు. తర్వాత కాలంలో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల సౌలభ్యం కొంత పెరిగినా .. వాటి తయారీలో పాటిస్తున్న పద్ధతులు కొన్ని కొత్త సమస్యలను తెస్తున్నాయి. ప్యాడ్‌లకు మదుత్వం, పీల్చుకునే గుణం పెంచటానికి సింథటిక్ ప్లాస్టిక్ పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇది చాలా హానికరమని, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని రకాల శానిటరీ ప్యాడ్ల తయారీలోనూ థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు వంటి హానికర రసాయనాలు వాడుతున్నారు. ఫ్లెక్సిబిలిటీ, పారదర్శకత, ఎక్కువ మన్నిక కోసం థాలేట్స్‌ను కలుపుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) ప్రకారం.. థాలేట్స్ అనేది యుక్త వయస్సులో శరీరంలో మార్పులను ప్రేరేపిస్తుంది. క్యాన్సర్, సంతానోత్పత్తి లోపాలకు కారణం అవుతుంది. టెస్టిక్యులర్ డిస్జెనిసిస్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. ఇంకా ఈ రసాయనాలు అండాశయ, రొమ్ము క్యాన్సర్లకు కారణమవుతున్నాయని నిపుణులు తేల్చారు. ఈస్ట్రోజెన్ వంటి స్త్రీ హార్మోన్లను ప్రభావితం చేస్తాయని, అది క్రమరహిత ఋతుస్రావానికి దారి తీయొచ్చని కూడా అంటున్నారు.
పరీక్షల్లో నిర్ధారణ
ప్రముఖ బ్రాండ్ శానిటరీ ప్యాడ్లలో విషపూరితమైన స్టైరిన్, క్లోరోఫామ్, క్లోరోమీథేన్ సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉన్నట్లు 2014లో విమెన్స్ వాయిస్ ఫర్ ఎర్త్ గ్రూప్ నివేదించింది. 2017లో ఒక దక్షిణ కొరియా అధ్యయన నివేదిక కూడా శానిటరీ ప్యాడ్లలో వీఓసీల అధిక స్థాయిల్లో ఉన్నట్లు హెచ్చరించింది. సదరు కంపెనీపై మహిళా సంఘం దావా కూడా వేసింది. అయితే, నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (ఎన్‌హెచ్‌ఏఎన్‌ఈఎస్) 2001-04 డాటాను ఉపయోగించి అధ్యయనం జరిపింది. దీని ప్రకారం 20- 49 ఏళ్ల వయస్సు మధ్య గల మహిళల్లో యోని డౌచింగ్ ఫ్రీక్వెన్సీ 1, 4 -డైక్లోరోబెంజీన్ రక్త సాంద్రతల మధ్య సానుకూల సహ సంబంధాన్ని నివేదించింది. దాంతో ఈ ప్రత్యేక సమ్మేళనం క్యాన్సర్లకు కారణమవుతుందని పరిశోధకులు తేల్చారు.
సురక్షితంగా వాడాలి
పెరినియల్ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం లేకుండా అవసరమైనంత నీరు తాగుతూ ఉండాలి. పెరినియల్ పరిశుభ్రతను పాటించాలి. సువాసనలతో కూడిన ప్యాడ్‌లను వాడకుండా చూసుకోవాలి. రేపర్లపై కోట్ చేసే సేంద్రియ వంటి పదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దురద, ఎరుపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.