May 29,2023 20:46
  • రెజ్లర్ల అరెస్టును ఖండిస్తూ ఆందోళనలు
  • బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌

ప్రజాశక్తి- యంత్రాంగం : తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమిస్తున్న మహిళా రెజ్లర్లపై ఆదివారం జరిగిన పైశాచిక దాడిని ఖండిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి వెంటనే తొలగించి అరెస్టు చేయాలని, అరెస్టు చేసిన రెజ్లర్లని విడుదల చేయాలని నినదించారు. సిపిఎం, సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సినిమా సెంటర్లో ప్లకార్డులతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని 40 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రతి ఒక్కరూ రెజ్లర్లకు మద్దతుగా నిలవాలని కోరారు. విశాఖ నగరంలో సిపిఎం ఆధ్వర్యాన డాబాగార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ దేశానికి పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో మనదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన రెజ్లర్లపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పోలీసులతో నిర్బంధ కాండ ప్రయోగించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రోజురోజుకు బిజెపి నిరంకుశపోకడలు పెరిగిపోతున్నాయన్నారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఐద్వా, సిఐటియు ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళా రెజ్లర్లపై బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. కర్నూలులో ప్రజాసంఘాల ఆధ్వర్యాన నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ బ్రిజ్‌భూషణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని, మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.