Feb 08,2023 20:15

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పండించిన పంటలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉరవకొండ మార్కెట్‌యార్డు వద్ద బుధవారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి మధుసూదన్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రబీలో లక్షలాది ఎకరాల్లో పప్పుశనగ పంట సాగైందన్నారు. పంట చేతికొచ్చిన సమయంలో కొనుగోలు చేసే వారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 20 రోజులుగా పప్పుశనగ విత్తనాలను పొలాల్లోనే నిల్వ చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రయివేటు వ్యాపారులంతా ఒక్కటై క్వింటాలును రూ.4400 నుంచి రూ.4600కు మించి అడగడం లేదన్నారు. ఈ ధరకు అమ్ముకుంటే రైతులకు కనీసం పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మురళి, వీరాంజనేయులు, సిద్ధప్ప, రైతులు పాల్గొన్నారు.