May 25,2023 06:53

మహిళలు అన్ని విషయాల్లో ముందుంటున్నప్పటికీ కొన్ని పనుల్లో మగవాళ్లైతేనే సమర్థవంతంగా చేస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అందులో కాంట్రాక్టర్‌గా రాణించడం అంటే కష్టంతో కూడింది. అయినా జిగ్మెట్‌ నార్జోమ్‌ తన వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడమే కాకుండా... తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రంలోనే తొలి మహిళా కాంట్రాక్టర్‌గా గుర్తింపు పొందింది. తను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను తన మాటల్లోనే విందాం.

2


'నేను పుట్టాక మా అమ్మ నాన్నలు విడిపోయారు. దాంతో నా బాల్యం దుర్భరంగా గడిచింది. ఇరువురూ నా బాధ్యత తీసుకోలేదు. మా అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగా. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ లేకపోవడంతో బాల్యంలో జీవితం పట్ల ఏదో కొరతగా అనిపిస్తూ ఉండేది. కాని మా తాతయ్య వాళ్లు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. 'నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి' అని. దాంతో ఒకరి మీద ఆధారపడకుండా అన్ని పనులూ స్వయంగా చేసుకోవడం అలవాటు పడ్డా. దాంతో మగవాళ్లు చేసే పనులు నేనూ చేసేదాన్ని. ఉన్నత లక్ష్యంతో జమ్మూ యూనివర్సిటీలో టూరిజంలో విద్యాభ్యాసం పూర్తి చేశా. ఎలా ముందుకెళ్లాలో చెప్పేవారు లేక ఓ ఎన్జీవోలో రెండేళ్లు పని చేశా. సమయం వృథా చేస్తున్నట్లు అనిపించింది. ఏదో ఒక వృత్తిలో స్థిరపడాలని, అందులో మగవాళ్లతో సమానంగా పనిచేయగలను అనిపించుకోవాలని తపన ఉండేది. తాతయ్య అందుకు ప్రోత్సహించారు.

3
  • కూలీలే నమ్మలేదు...

మూడేళ్ల క్రితం మూడు లక్షలు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్‌గా బిజినెస్‌లో అడుగు పెట్టా. టెండర్లు వేయడం, ప్రాజెక్టులు దక్కించుకోవడం ఓ ఎత్తు .. అయితే మన చుట్టూ ఉన్న వారిచేత పనిచేయించడం మరో ఎత్తు. ఈ క్రమంలో పనిచేసే కూలీలతో మాట్లాలి, వారిచేత దగ్గరుండి పని చేయించాలి. వారు ఆ పనిలో నైపుణ్యం ఉన్నవారు కావడంతో నా మాట వినేవారు కాదు. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారు. పని చేయడంలోనూ అలసత్వం ప్రదర్శించేవారు. నా మాటను లెక్కచేసేవారు కాదు. నాకు ఈ ఫీల్డ్‌ పట్ల అవగాహన లేదన్నట్లుగా ప్రవర్తించేవారు. నా దగ్గర పని చేయడం కన్నా మగ కాంట్రాక్టర్ల దగ్గరకు పని చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. ఇలా నిరాశ పరిచే ఘటనలు మొదట్లో ప్రతిరోజూ ఎదురయ్యాయి. అయినా నేను వెనక్కి తగ్గలేదు.
నిదానంగా బిల్డింగ్‌ నిర్మాణాన్ని, మెటీరియల్స్‌ వివరాలను పూర్తిగా అధ్యయనం చేశా. పనిలో నాణ్యత చాలా ముఖ్యం. దీని ప్రాతిపదికనే కొత్త ప్రాజెక్టులు కూడా వస్తాయి. కూలీలతో పాటు నేనూ పనిచేసేదాన్ని. యంత్రాలూ నడిపా. నిదానంగా కార్మికుల్లో నా మీద విశ్వాసం కలిగింది. క్రమంగా పరిస్థితులు మారాయి. ఎవరైతే 'ఈమె కాంట్రాక్టర్‌గా పనికిరాదు' అనుకున్నారో వారే నా దగ్గరకు పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఈ రెండేళ్లలో 10 ప్రాజెక్ట్‌లను పూర్తి చేశా. పని చేసిన ప్రాజెక్ట్‌లు చాలా వరకు లేV్‌ా నుంచి 34 కి.మీ దూరంలో ఉన్న మా ఊరు కరూ గ్రామ చుట్టుపక్కల ఉండేవి. సాగునీటి కాలువలు నిర్మించాను. పాతపడిన పాఠశాలలను పునర్నిర్మించా. కొత్త రోడ్లు వేశాను. అవి పూర్తి అయినప్పుడు పడిన కష్టం అంతా మర్చిపోతా. అప్పుడప్పుడు వాటి చూస్తున్నప్పుడల్లా చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. ఇంకా మరిన్ని ప్రాజెక్టులు చేయాలన్న పట్టుదలా పెరుగుతోంది. ఇప్పుడు, నేను లడఖ్‌లో అత్యంత విజయవంతమైన కాంట్రాక్టర్లలో ఒకరిగా నిలబడ్డా. మగవాళ్లతో సమానంగా ప్రాజెక్టులు పూర్తి చేయగలనన్న పేరు తెచ్చుకున్నా. 28 ఏళ్ల వయస్సుకే ఈ పేరు తెచ్చుకోవడం మా తాతయ్యకు గర్వంగా ఉంది. భవిష్యత్తులో 'వాళ్ల కన్నా సమర్థవంతంగా చేయగలదు' అనే నమ్మకాన్ని సంపాదించాలనుకుంటున్నా.