Nov 23,2022 07:57

సమాజంలో మహిళలు రకరకాల రూపాల్లో హింసను ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని జీవించడమే గొప్ప ధైర్యం. కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందడం అనేది మరింత సాహసం. డాక్టర్‌ మహాలక్ష్మి ఈ కోవకే చెందుతారు. వైద్యం అందిస్తున్న ఆమెపై జరిగిన యాసిడ్‌ దాడి మానసికంగా కుంగదీసింది. అయినా ఆత్మస్థైర్యంతో తిరిగి తన జీవితాన్ని నిర్మించుకోవడంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. చూపు లేదని నిరుత్సాహపడలేదు. వైద్యసేవలు అందిస్తూనే తనలాంటి బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నారు.

ర్ణాటక, మైసూరుకు చెందిన మహాలక్ష్మి ఇరవై ఏళ్ల క్రితం డాక్టర్‌ పట్టా పుచ్చుకున్నారు. మంచి వైద్యురాలిగా పేరు తెచ్చుకోవాలన్న ఆశతో క్లినిక్‌ ప్రారంభించారు. శివబసవయ్య అనే వ్యక్తికి చెందిన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. కొన్ని నెలలకు మరొక భవనానికి మహాలక్ష్మి ఆసుపత్రిని మార్చారు. తాను ఇచ్చిన అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వమని శివ బసవయ్యను అడగ్గా... అతడు లెక్కచెయ్యలేదు. ఆమెను బెదిరించాడు. 'డబ్బులు ఇవ్వను... ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో' అంటూ దుర్భాషలాడాడు. దాంతో మహాలక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. అది సహించలేక అతను, ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి యాసిడ్‌ దాడి చేశాడు. దీన్ని ప్రత్యక్షంగా చూసిన వారు కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు వెనకాడారు. అయినా మహాలక్ష్మి వెనకడుగు వేయలేదు. ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్షపడేలా చేశారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నారు. ఆమె కుటుంబం అడుగడుగునా ఆమెకు అండగా నిలబడింది. ఆ ధైర్యమే ఆమెను తిరిగి మనిషిని చేసింది.
      బలవంతులు మాత్రమే సమాజంలో జీవించగలరు. బలహీనులు రోజూ చస్తూ బతుకుతారు అన్న మాటలు ఆమెను నిత్యం వెంటాడసాగాయి. మహాలక్ష్మి శారీరకంగా, మానసికంగా నిత్యం జీవన పోరాటం సాగించారు. దాడి జరిగిన రోజు ఆమె అనుభవించిన బాధ, రోదన జీవితంలో మరిచిపోలేనిది. మంచినీళ్ల కోసం పెట్టిన కేకలు హృదయ విదారకం. కనీసం హాస్పటల్‌కు తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దూరంగా జనం ఉన్నా - అతను ఏం చేస్తాడోనన్న భయంతో ఆమె దగ్గరకు వచ్చే సాహసం చేయనీయలేదు.
      యాసిడ్‌ వల్ల కళ్లు పోగొట్టుకున్న మహాలక్ష్మి ఇంటికే పరిమితమైంది. ఏడాది పాటు మంచం మీద ఉండిపోయారు. గాయాల నుంచి రక్తం కారుతూ, మంటలు వచ్చేవి. భరించలేక చాలారోజులు ఏడ్చారు. మానసికంగా కుంగిపోయారు. అదే సమయంలో ఆమె ఆలోచనల్లో పడ్డారు. తప్పు చేసిన వాడు బయట తిరుగుతున్నాడు.. ఏ తప్పూ చేయని నేనెందుకు ఇంట్లోనే ఉండాలి? కళ్లు పోతే ఏం చేయలేమా? సాధించలేమా? అన్న ప్రశ్నలు ఆమెను ఇంట్లో ఉండన్విలేదు. అక్కలు, అమ్మ సహాయంతో బయటకు అడుగు వేశారు. దాడిచేసిన వ్యక్తిపై తిరిగి కేసు పెట్టారు. కానీ జిల్లా కోర్టులో ఆమెకు నిరాశ ఎదురైంది. శివబసవయ్య నిర్దోషిగా బయటకు వచ్చాడు. దాంతో మహాలక్ష్మి నిందితునికి శిక్ష పడాలంటూ, తనకు న్యాయం చేయమని తర్వాత కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. పదేళ్లు సుదీర్ఘ న్యాయ పోరాటం చేయగా హైకోర్టు ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించి, మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
తిరిగి చదువుకుని ...
     కళ్లులేని కారణంగా వైద్యవృత్తిలో రాణించటం కష్టం.. నోటి ద్వారా అయినా ప్రజలకు వైద్యం చేయాలనుకున్నారు. ఎంఎస్సీ సైకాలజీలో చేరి, డిగ్రీ సాధించారు. అయితే, కాలిపోయిన ఆమె శరీరాన్ని చూసి చాలామంది భయపడిన సందర్భాలు ఆమెను బాధపెట్టాయి. 50 శాతం కాలిపోయిన ముఖానికి శస్త్రచికిత్సలు చేయించుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు కూడా ఎంతో బాధను భరించారు. మొఖం, రెండు చేతులకూ 10 ఏళ్ల పాటు నెలల వ్యవధిలో 25 సార్లు శస్త్రచికిత్సలు చేయించారు. సైకాలజిస్టుగా తనకు తాను మొదట పేషెంట్‌గా ఫీలయ్యారు. జరిగిన దాడి నుంచి బయటపడేలా మనోధైర్యం తెచ్చుకున్నారు. మహాలక్ష్మి పట్టుదల, ప్రతిభను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో ఉద్యోగ అవకాశం కల్పించారు. దాంతో తన దగ్గరకు వస్తున్న మానసిక రోగులకు కౌన్సిలింగ్‌ చేస్తూ, శారీరక ఆరోగ్యంపై ఏవిధంగా దృష్టి సారించాలో వివరిస్తున్నారు. ప్రతిరోజూ 60 - 80 మంది రోగులు ఆమె దగ్గరకు వస్తూ ఉంటారు. ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నానన్న తృప్తితో తనకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోతున్నారు. కోవిడ్‌ సమయంలోనూ పేషెంట్లకు కౌన్సిలింగ్‌ చేశారు. టీకాల పంపిణీలో ఊరురా తిరుగుతూ క్యాంపెయన్‌లో పాల్గొన్నారు.
 

                                                           మహిళ సాధికారతకు కృషి

'మహిళలకు విద్య చాలా ముఖ్యం. నేను తిరిగి నిలబడ్డాను అంటే చదువుకోవడం వల్లే. ఆ సమయంలో నా కుటుంబం నాకు రక్షణగా నిలిచింది. వారి ఇచ్చిన ధైర్యంతోనే తిరిగి జీవితాన్ని ప్రారంభించా. మహిళలకు సమాజంలో ఎదురయ్యే దాడులు, వేధింపుల నుంచి బయటపడేందుకు బలమైన సహాయక వ్యవస్థను ప్రభుత్వాలు కల్పించాలి.' అంటారు మహాలక్ష్మి. ఇప్పుడామె ఎంతోమంది మహిళలకు ధైర్యవచనం. తన దగ్గరకు వస్తున్న మహిళల వ్యక్తిగత, గృహహింస విషయాలు తెలుసుకుని, వాటి నుంచి ఎలా బయటపడాలో చెబుతున్నారు. చదువుకోవాలనుకున్న వారికి సహాయం చేస్తున్నారు. యాసిడ్‌ దాడి బాధితులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. డాక్టర్‌ మహాలక్ష్మి ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు.