
ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతికూల వైఖరి నష్టదాయకం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ధర్నా చేపట్టిన టీచర్లను, వారికి మద్దతు తెలిపిన పిడిఎఫ్ ఎమ్మెల్సీలను బుధవారంనాడు అరెస్ట్ చేయడం దారుణం. అనుమతి ఉన్నప్పటికీ ఇటీవల ఎన్నడూ లేని విధంగా పోలీసులు ధర్నా శిబిరం టెంట్లను సైతం పీకించడం, కుర్చీలను పక్కనపడేయడంలో టీచర్లపట్ల ప్రభుత్వ కక్షపూరిత వైఖరి ప్రస్ఫుటమవుతోంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం నుంచే ఉపాధ్యాయులపై నిర్బంధం ప్రయోగించారు. వివిధ జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేశారు. ఉపాధ్యాయులు తమకు న్యాయంగా చట్ట ప్రకారం రావలసిన బకాయిలిమ్మన్నారే తప్ప గొంతెమ్మ కోర్కెలు కోరలేదు కదా! పిఆర్సి చర్చల సందర్భంగా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.650 కోట్లు మార్చి 2022 నాటికి క్లియర్ చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం సమక్షంలో ఆర్థికశాఖ అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తి బకాయిలు చెల్లించలేదు. పాత బకాయిలు, మంజూరైన పి.ఎఫ్, తదితర లోన్లు జమ చేయకపోవడం, సిపిఎస్ ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వ వాటా చెల్లించకపోవడం, రిటైరయిన వారి బెనిఫిట్స్ చెల్లించకపోవడం తదితర సమస్యలపై టీచర్లు శాంతియుతంగా ధర్నా చేశారుతప్ప ఎలాంటి హింస లేదా విధ్వంసానికి పూనుకోలేదు. అయినా సర్కారు ఉపాధ్యాయులపై మరోసారి ఉక్కుపాదం మోపడం తగదు. నిర్బంధానికి నిరసనగా తమ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు యుటిఎఫ్ 'నిరసన జాగరణ' కార్యక్రమం నిర్వహించి ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించింది.
ఉపాధ్యాయులకు బోధనేతర పనుల మినహాయింపు పేరిట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వారిని ఎన్నికల విధుల నుండి తప్పించడానికేనన్నది బహిరంగ రహస్యం. టీచర్లు ఎన్నికల విధుల్లోవుంటే అధికార పార్టీకి ప్రతికూలంగా ప్రభావితం చేస్తారన్న బెంగతోనే ఇలాంటి చర్యలకు పూనుకుంటోందన్నది జనవాక్యం. నిజంగా టీచర్లను బోధనేతర విధులనుండి తప్పించడమే సర్కారు ఉద్దేశమైతే ఉపాధ్యాయులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న యాప్‌లను కొనసాగించరాదు. ప్రభుత్వం రుద్దిన యాప్‌ల వల్ల ప్రతిరోజూ ఒకవైపు పని ఒత్తిడి మరోవైపు టెన్షన్ పడుతున్నారని, వాటినలాగే ఉంచి పదేళ్లకోసారి వచ్చే జనగణన, ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. యాప్‌లకు మినహాయింపు ఇవ్వకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పాఠశాల విద్యలో ఉన్న యాప్‌లు ఏ శాఖలోనూ లేవు. బడికెళ్లగానే టీచర్ ముఖ ఆధారిత హాజరు నుండి విద్యార్థుల హాజరు, మానిటరింగ్, మధ్యాహ్న భోజనం, నాడు-నేడు పనులు, కోడిగుడ్ల సైజులు చూసుకోవడం, బియ్యం లెక్కలు, మరుగుదొడ్లు ఫోటోలు తీయడం...ఇలా ఎన్నో పనులను అప్పగించింది. వీటికోసం 32 రకాల యాప్‌లు, వాటిలో 16 యాప్‌లలో ప్రతి రోజూ ఉపాధ్యాయుడు నమోదు చేయాలి. సర్వర్లు, నెట్వర్క్ సమస్య వల్ల యాప్‌లో సమాచారం నమోదు చేయని వారికి కూడా విద్యాశాఖ షోకాజ్ నోటీసు ఇస్తోంది. ఇటీవల ఒక ఉపాధ్యాయుడు తలనీలాలిచ్చినందున ముఖ ఆధారిత హాజరులో నమోదు కాకపోయినా ఆయనకు షోకాజ్ నోటీసులిచ్చారంటే సర్కారు వేధింపుల తీవ్రత ఎంతలా ఉందో విదితమవుతోంది. ఇలాంటి భయాలమధ్య టీచర్లు బోధన కంటే యాప్‌లతో కుస్తీ పట్టాల్సివస్తోంది. కనుక టీచర్లను ఈ యాప్‌ల నుంచి విముక్తులను చేయడం అవశ్యం. ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా యోచించాలి.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తానిచ్చిన హామీ ప్రకారం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. నిరసన తెలిపేవారిపై నిర్బంధ చర్యలను మానుకోవాలి. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులను సర్కారు దండించడం తగదు.