May 29,2023 21:48

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ప్రభుత్వ రంగంలో నడుస్తున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైందని, అటువంటి కర్మాగారాన్ని ప్రయివేటు వ్యక్తులకు అమ్మేయాలనుకోవడం దుర్మార్గమని ఐద్వా నేతలు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు సోమవారానికి 788వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఐద్వా కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఐద్వా విశాఖ జిల్లా కార్యదర్శి వై సత్యవతి మాట్లాడుతూ చారిత్రక పోరాటంతో ఏర్పడ్డ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రెండేళ్లకుపైగా ఉక్కు ఉద్యమం స్ఫూర్తిదాయకంగా సాగడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలే దేశానికి పట్టుగొమ్మలని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వాటిని విరిచేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలు ఉంటేనే మహిళలకు ఉద్యోగావకాశాలు ఉంటాయని, రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపారు. మున్ముందు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో సంఘం నాయకులు ఎ పుష్పాంజలి, సాహు, కె లక్ష్మి, సుజాత, సుమిత్ర పాల్గొన్నారు.