May 16,2023 21:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం రవాణా వాహనాలపై పెంచిన త్రైమాసిక పన్నులను తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. సరుకు రవాణా వాహనాలపై పెంచే పన్నుల ప్రభావం వాహన యజమానులతోపాటు నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా, సరుకు రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నును పెంచడంతో రవాణా రంగం మరింత కుదేలవుతుందని పేర్కొన్నారు. కరోనాతో ఈ రంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. కరోనా నేపథ్యంలో ఈ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి అప్పులపాలయ్యారని తెలిపారు. ఈ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోకుండా భారీగా పన్నులు పెంచడం సరైందికాదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సెస్సులు, పన్నులు పెంచుతూ మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందని విమర్శించారు. గ్రీన్‌ ట్యాక్స్‌ కింద పక్క రాష్ట్రాల్లో రూ.200, రూ.500 వసూలు చేస్తుంటే మన రాష్ట్రంలో దాన్ని కూడా శ్లాబుల వారీగా రూ.వేలల్లో వసూలు చేస్తున్నారన్నారు. సెస్సుల వసూలు అదనపు భారంగా మారిందని పేర్కొన్నారు. 30 శాతం పెరిగిన త్రైమాసిక పన్నులతో వాహన యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, తక్షణమే పన్నులను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.

  • పెంచిన పన్నులను తగ్గించకపోతే రోడ్డెక్కుతాం : ఎపి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌

రాష్ట్ర ప్రభుత్వం రవాణా వాహనాలపై పెంచిన త్రైమాసిక పన్నులను తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులు ఆందోళనబాట పడతామని ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఈ మేరకు విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వద్ద వున్న ఎపి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం త్రైమాసిక పన్నుల పెంపునకు సంబంధించి ఈ ఏడాది జనవరి 11న నోటిఫికేషన్‌ ఇచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఈ పన్నుల పెంపుపై అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. వాహన యజమానులతోపాటు పలు సంస్థలు అభ్యంతరాలు తెలిపినా రాష్ట్రప్రభుత్వం 30 శాతం పన్నులను పెంచడం సరైందికాదన్నారు. రవాణాశాఖ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. గ్రీన్‌ ట్యాక్స్‌ను రూ.200 నుంచి ఏకంగా రూ.20 వేలకు పెంచడం తగదన్నారు. త్రైమాసిక పన్నులను కూడా పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా పెంచేశారని అన్నారు. ఆరు టైర్ల లారీలకు రూ.3,940 నుంచి రూ.4,790కు, పది టైర్ల లారీలకు రూ.6,580 నుంచి రూ.8,390కు, 12 టైర్ల లారీలకు రూ.8,520 నుంచి రూ.10,910కు, 14 టైర్ల లారీలకు రూ.10,480 నుంచి రూ.12,430కు, 16 టైర్ల లారీలకు రూ.11,980 నుంచి రూ.15,590కు పెంచారన్నారు. పొరుగు రాష్ట్రాల కన్నా డీజిల్‌ ధరలు చాలా ఎక్కువగా వున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రవాణా రంగం గురించి ఆలోచించకపోవడం సరికాదన్నారు. తక్షణమే త్రైమాసిక పన్నులను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పన్నులను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు.