
రాజాం రచయితల వేదిక (రా.ర.వే) ముగ్గురు మిత్రుల ఆలోచనతో మొలకెత్తిన సాహితీ సంస్థ. 'సాహిత్యము, సమాజము రెండు కళ్ళు' అనే మూల సూత్రంతో 2015 జనవరి 25వ తేదీన ఉత్తరాంధ్రకు చెందిన రాజాం అనే చిన్న పట్టణంలో ఆవిర్భవించింది. నేడు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని, ఉత్తమ సాహితీ విలువలను పరివ్యాప్తి చేస్తూ 100వ సమావేశం జరుపుకుంటోంది. దీనిని కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు గార రంగనాథం నడిపిస్తున్నారు.
కొన్ని సాహిత్యాంశాలను ముందుగానే నిర్ణయించుకొని, ప్రతి నెలా ఒక సాహిత్యవేత్తను ఆహ్వానించి, వారితో ముఖ్య ప్రసంగం ఇప్పించడమే ప్రధాన లక్షణంగా రా.ర.వే సాగుతోంది. ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము అనే భేదం లేకుండా అన్ని ప్రక్రియల్లో వచ్చిన మంచి సాహిత్యాన్ని ప్రజలకు చేరవేయడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తోంది. వక్తల ముఖ్య ప్రసంగం పూర్తయిన తరువాత రా.ర.వే సభ్యులు స్వీయ రచనలు వినిపించడం ఆనవాయితీ. నిర్వాహకునితో పాటు గురుగుబిల్లి జగన్నాథరావు, ఒమ్మి రమణమూర్తి, నేతేటి గణేశ్వరరావు, డా:ఆల్తి మోహనరావు, బొంతు సూర్యనారాయణ, పిళ్లా తిరుపతిరావు, పొదిలాపు శ్రీనివాసు, కుదమ తిరుమలరావు, పడాల కవీశ్వరరావు, ఉరిటి గున్నేశ్వరరావు, పోలాకి ఈశ్వరరావు మొదలగువారు పద్య, వచన కవులు, వ్యాస రచయితలు, కథకులుగా గుర్తింపు పొందుతున్నారు.
వేదిక స్థాపించిన మూడేళ్లలో నందనందనము, పరిమళ భావ తరంగాలు, తరంగ ధ్వానాలు అనే మూడు పుస్తకాలను సంస్థ ముద్రించింది. నాలుగో వార్షికోత్సవంలో బాలసాహితీ సదస్సు నిర్వహించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. రంగనాథం సంపాదకత్వంలో 'సాహితీ సౌరభాలు' అనే 17 వ్యాసాల గ్రంథాన్ని 'ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సాంస్క ృతిక సమితి' అచ్చు వేయించింది. సంస్థ ఐదో వార్షికోత్సవంలో జరిగిన ఈ గ్రంథ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వచ్చారు. సమితి పూర్వ సంచాలకులు దీర్ఘాశి విజయ భాస్కర్ ఆ పుస్తక పరిచయం చేశారు. ప్రముఖ కథా, నవలా రచయిత అట్టాడ అప్పలనాయుడు రచించిన 'బహుళ' నవలను ఆరవ వార్షికోత్సవంలో డా: డి.వి.జి శంకరరావు ఆవిష్కరించారు. గత ఏడాది మే 29న ఏడవ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఆ సభలో పిళ్లా తిరుపతిరావు 'ఆజిరి' సాహిత్య వ్యాసాల సంపుటిని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఆవిష్కరించారు. ప్రముఖ విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య పుస్తక పరిచయం చేశారు. ఈ వేదికపై దాసరి రామచంద్రరావు 'అల్పపీడనం' గంటేడ గౌరునాయుడు 'సేద్యగాడు' పద్యకావ్యం వంటి పుస్తక పరిచయ సభలు జరిగాయి. శ్రీ కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద ప్రబంధంపై సామాజిక కోణంలో రంగనాథం రచించిన 374 పుటల 'రాయరత్న మంజూష' విమర్శనాత్మక ఉద్గ్రంథాన్ని గుంటూరుకు చెందిన బొమ్మిడాల శ్రీ కష్ణమూర్తి ఫౌండేషన్ ప్రచురించింది. ఈ పొత్తం ఆవిష్కరణకు ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చిన వీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఎనిమిదో వార్షికోత్సవంలో రంగనాథం సంపాదకత్వం వహించిన 'విస్మ ృత కళింగాంధ్ర సాహితీ ప్రభ' అనే 30 వ్యాసాల గ్రంథాన్ని డా. దామెర వెంకట సూర్యారావు ఆవిష్కరించారు. ప్రముఖ వైద్యులు డా: కణుగుల సుధీర్ ఆర్థిక సహాయంతో ఈ గ్రంథ ముద్రణ జరిగింది.
2023 మే 28 ఆదివారం రాజాంలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్లో రా.ర.వే 'శత సాహితీ సమావేశ సంబరాలను జరుపుకుంది. ఈ సందర్భంగా రంగనాథం యొక్క 150 సూక్తి శ్లోకాలకు, 150 ఆటవెలది పద్యానువాదాల 'సూక్తి రత్న మంజరి'ని సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు చీకటి దివాకర్ ఆవిష్కరించారు. వేదిక నిరంతరంగా స్థానికంగా ఉన్న ప్రతి కళాశాలలో 'తెలుగు మాట- వెలుగు బాట' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, విద్యార్థులకు మాతృభాషపై మమకారం కలిగేలా చైతన్య పరుస్తోంది. మున్ముందు మరిన్ని కార్యక్రమాలతో పురోగమించాలని ఆశిద్దాం.
- జానకి,
94417 16658