Mar 20,2023 09:53

అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు
తడిసిన ధాన్యం శ్రీ నేలరాలిన మామిడి, మొక్కజన్న, అరటి

ప్రజాశక్తి-యంత్రాంగం :  అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలను నీటిపాలు అయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా పలు జిల్లాలో గత మూడు రోజులుగా ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మొక్కజొన్న, అరటి పంటలు నేలవాలగా, ధాన్యం తడిసిపోయింది. మిర్చి, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. మామిడి పిందె, పూత నేలరాలాయి. పిడుగుపాటుకు 78 జీవాలు మృత్యువాత పడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్‌ మండలంలో వెయ్యి ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 50 ఎకరాల్లో మామిడి, 20 ఎకరాల్లో నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. బుచ్చినాయుడు కండ్రిగలో వరిపంట నేలకొరిగింది. రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కళ్లాల్లో నీరు నిల్వ ఉండడంతో వేరుశెనగ పంట దెబ్బతింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాల కారణం నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలో కురిసిన భారీ వడగళ్ల వర్షానికి టమోటా, బొప్పొయి, కర్బూజా, మామిడితో పాటు పలు పూల తోటలు దెబ్బతిన్నాయి. సుమారు 12 ఎకరాల్లో టమోటా పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు పాలసముద్రం మండలంలో మామిడి, సపోటాలు నేలరాలాయి. పలమనేరులో మామిడి పిందె, పూత రాలిపోయాయి.

కడప జిల్లాలోని వేంపల్లె, ముద్దనూరు మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేంపల్లెలో అరటి, నిమ్మ, మామడి, చీని తోటలు దెబ్బతిన్నాయి. 255 ఎకరాల్లో అరటి, 30 ఎకరాల్లో చీని, 141 ఎకరాల్లో నిమ్మ, 132 ఎకరాల్లో తమలపాకులకు నష్టం వాటిల్లింది. ముద్దనూరులో సుమారు 176 ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఎర్రగుంట్ల మండలం దండుపల్లిలో వర్షానికి రేకుల ఇల్లు కూలడంతో దంపతులు ఎర్రగొర్ల కృష్ణయ్య, లక్షుమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరులో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షం కారణంగా తడిసి ముద్దయింది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలో అత్యధికంగా 72.2 మిలీమీటర్ల వర్షపాతం నమోదయింది. లావేరు మండలంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంట వర్షానికి తడిచిపోయింది. టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీ పరిధిలోని దీపావళి గ్రామంలో పిడుగుపాటుకు 78 జీవాలు మృతి చెందాయి. శ్రీకాకుళం నగరం బలగలోని భద్రమ్మగుడిపై పిడుగు పడడంతో ఆలయ గోడలకు బీటలు వారాయి. గుడి గోపురంపై ఉన్న విగ్రహం ధ్వంసమైంది. ఎన్‌టిఆర్‌ జిల్లా కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో కళ్లాల్లో ఉన్న మిర్చి వర్షానికి తడిసిపోయింది. కృష్ణా జిల్లాలో వర్షం కారణంగా పంట పొలాల్లో మినుప కాడ నీట మునిగి మినుములు ఉబ్బిపోయాయి. గుడ్లవల్లేరు మండలంలో కూరాడ వద్ద రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, డుంబ్రిగుడ, జికె.వీధి మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడ్డాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేట, గొలుగొండ మండలం గుండుపాల గ్రామాల్లో పిడుగుల ధాటికి రెండు గేదెలు మృతి చెందాయి. నువ్వు, జీడి మామిడి, మామిడి పంటలకు మాత్రం నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. విశాఖ జిల్లాలో చిరుజల్లులు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రైల్వేస్టేషన్‌ రోడ్డు నీట మునగడంతో రెండు గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. కోనసీమ జిల్లా అమలాపురం, అంబాజీపేటలో కురిసిన వర్షాలకు వరిచేల్లోకి నీరు చేరింది. కాకినాడలో కచేరిపేట నీట మునిగింది.