Nov 23,2022 13:53

అమరావతి : రానున్న రెండురోజులు ఎపిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణశాఖ అధికారులు మాట్లాడుతూ ... నిన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని పశ్చిమ మధ్యన ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న అల్పపీడనం.. ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, దాని పొరుగు ప్రాంతాల మీద బలహీనపడి కొనసాగుతోందని అన్నారు. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం మీద 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి.. నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని చెప్పారు. ఈ ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తరాంధ్రలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణాంధ్రలో మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో... ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ... ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని, మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని తెలిపింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది.
రాయలసీమలో .... ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని చెప్పింది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని తెలిపింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.