
పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు
శబరిమల దర్శనం నిలిపివేత
17కి చేరిన వర్ష మృతులు
అప్రమత్తంగా ఉండండి: ముఖ్యమంత్రి విజయన్
మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి: వాతావరణ కేంద్రం హెచ్చరిక
తిరువనంతపురం : గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదలు కేరళను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కేరళ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 17 మంది దాకా చనిపోయారు. అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను సమాయత్తం చేశారు. పతనాంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. మలప్పురం, వాయనాడ్, కాసరగోడ్, కొజికోడ్, కొల్లాం జిల్లాలకు అరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. అక్కడ ఎన్‌డిఆర్‌ఎఫ్ బలగాలను మోహరించారు. అటవీ, కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో డ్యామ్‌లలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద పరిస్థితిని ముఖ్యమంత్రి విజయన్, ఇతర మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తమిళనాడులోని అలియార్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో భరతపూజ నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా శబరిమల దర్శనాన్ని గురువారం మధ్నాహ్నం నుంచి మూసివేశారు. ఇప్పటికే కొండపైన ఉన్నవారు సాయంత్రం 6 గంటల కల్లా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు.