May 28,2023 11:40

రోమ్‌ : వేతనాలు పెంచాలని, ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటలీ, స్పెయిన్‌ల్లో శుక్రవారం భారీ ఎత్తున సమ్మె జరిగింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం కార్మికులు డిమాండ్‌ చేశారు. నెలకు 300 యూరోల వేతనాన్ని పెంచాలని, గంటకు కనీసం 10 యూరోల వేతనం ఇవ్వాలని నినదించారు. 'బతకడానికి పని చేయండి, పని చేయడానికి జీవించడం కాదు' అని కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇటలీ రాజధాని రోమ్‌తోపాటు, ఇతర నగరాల్లోనూ కార్మికులు భారీఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వేలాది మంది ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు వంటి సమస్యలకు ప్రభుత్వం అనుసరిస్తున్న 'యుద్ధపూరిత విధానాలు' కారణమని నిరసనకారులు విమర్శించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. స్పెయిన్‌లోనూ పెద్దఎత్తున ర్యాలీలు జరిగాయి. వేతనాలు పెంచాలని, 'ఆరోగ్యం-విద్యను ప్రైవేటీకరించవద్దు' అని, 'ఆరోగ్యం, విద్యా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని' నినాదాలతో స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇంధన, ఆహార ధరలు పెరిగిపోయాయని ఆందోళనకారులు విమర్శించారు.
 

                                                                         సిఐటియు అభినందనలు

ఇటలీలో సమ్మె విజయవంతం చేసినందుకు సిఐటియు ఆ దేశ కార్మిక లోకానికి సిఐటియు అభినందనలు తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. యూనియన్‌ సిండకేల్‌ డి బేస్‌ (యుఎస్‌బి) బ్యానర్‌ కింద జరిగిన ఈ సమ్మె విజయవంతం కావడం శ్రామికవర్గానికి వ్యతిరేకంగా ఇటలీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఉన్న ఆగ్రహనికి నిదర్శనమని తెలిపింది. కార్మికుల జీవితాలు, జీవనోపాధిపై హద్దులేని దాడులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఈ నెల 26న సమ్మె జరిగిందని సిఐటియు తెలిపింది. ఇటలీలో ప్రధానమంత్రి జార్జియా మెలోని నేతృత్వంలో నయా ఫాసిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వేతనాలు తగ్గించడం వంటి చర్యల ద్వారా కార్మికులపై దాడులు ప్రారంభమయ్యాయని, అదే సమయంలో కార్పొరేట్‌, పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూల విధానాలు అమలవుతున్నాయని సిఐటియు విమర్శించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఇటలీ ప్రభుత్వం అమలు చేయాలని సిఐటియు కోరింది.