
ఇంటర్నెట్‌డెస్క్ : 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో 'నాటు నాటు' పాటకు 'ద బెస్ట్ ఒరిజనల్ సాంగ్' కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కిన సంగి తెలిసిందే. ఈ పాటకు సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్‌కి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణికి ఎంత పేరు దక్కిందో... ఈ సాంగ్‌కి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్‌కి అంతే పేరు వచ్చింది. అలాగే ఈ పాట ఇంత అందంగా, పదేపదే చూడాలన్నట్టుగా అనిపించడానికి కారణం రామ్‌చరణ్ ఒకత్తెయితే.. తెర వెనుక కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కష్టం మరో ఎత్తు అని కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కూడా ఇటీవల అన్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కొరియోగ్రఫీ, రాజమౌళికి అతనికి ఉన్న పరిచయం? వంటి విషయాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు దర్శకధీరుడు రాజమౌళికి ప్రేమ్ కళ్లెదుటే ఉన్నా.. ఓ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనే విషయమే తెలియదని సోషల్‌మీడియాలో ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ఈ విషయంపై తాజాగా ప్రేమ్ మాట్లాడుతూ.. 'నేను మొదట్లో ప్రేమ్ ట్రైలర్ షాపులో పనిచేసేవాడిని. ఆ తర్వాత చిన్నాచితకా సినిమాల్లో కొరియోగ్రఫీ చేస్తూ రాజమౌళి ఇంటికి వెళ్లి పిల్లలకు డ్యాన్స్ నేర్పేవాడిని. వాళ్లిచ్చిన డబ్బులతోనే నాకు పూట గడిచేది. ఊళ్లో ఉండే అమ్మానాన్నలు, ఇక్కడ నేనుండే ఇంటి అద్దె చూసుకునేవాడిని. నా తమ్ముడిని చదివించేవాడిని. రాజమౌళి సర్ ఎదురుగా ఉన్నా.. నేనెప్పుడూ కొరియోగ్రాఫర్‌ని అని ఆయనకు చెప్పలేదు. ఆ విషయం చెబితే.. నన్నెక్కడ పనిలోనుంచి తీసేస్తారోనన్న భయంతో చెప్పలేదు. ఒకవేళ నా గురించి ఆయనకు తెలిసినా.. అఫీషియల్‌గా కేవలం ఆఫీసులోనే కలుస్తారోరని ఓపెన్ అవ్వలేదు. ఒకరోజు రాజమౌళి ఇంట్లో విద్యార్థి సినిమాలోని పాట ప్లే అవుతుంది. ఈ పాటకు డ్యాన్స్ బాగుంది. ఎవరో గాని బాగా చేశారు అని ఆయన అనగానే... నా మనసు ఆగలేదు. వెంటనే ఆ పాటకి కొరియోగ్రఫీ చేసింది నేనే సార్ అని చెప్పాను. కానీ నేనేదో జోక్ చేశానని ఆయన నన్ను నమ్మలేదు. 'నువ్వు చేశావా... వెళ్లెళ్లు' అంటూ అపనమ్మకంగా మాట్లాడారు. నిజంగా నేనే చేశాను సార్ అని నేను ఆయన్ని నమ్మించే ప్రయత్నం చేయడంతో.. ఆయన ఫోన్ చేసి కనుక్కున్నారు. అప్పుడు ఆయనకు నిజం తెలిసి.. ఎందుకు మాస్టర్, ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. మీకు నిజం తెలిస్తే.. మీరు నన్ను పనిలోంచి తీసేస్తారని, నా కుటుంబ పోషణ కష్టమవుతుందని చెప్పలేదు సార్ అని అన్నాను. ఆ తర్వాత రాజమౌళి సర్ డైరెక్ట్ చేసిన ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, ఆర్‌ఆర్‌ఆర్ వరకు పలు సినిమాలకు నేను పనిచేశాను. రాజమౌళి సర్ భార్య రమా మేడమ్ ఎంతో ఆప్యాయంగా నాకు దోసెలు వేసి పెట్టేది. వాళ్లింటికి వెళ్తే నాకు కడుపునిండా భోజనం దొరికేది అని' ఆయన చెప్పుకొచ్చాడు.