Oct 03,2022 21:51

న్యూఢిల్లీ: భారత స్టార్‌ టెన్నిస్‌ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ జపాన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీకి అర్హత సాధించాడు. సోమవారం జరిగిన మెయిన్‌ డ్రా రెండోరౌండ్‌ పోటీలో రామనాథన్‌ ఎలిస్‌ యేమర్‌ను ఓడించి జపాన్‌ ఓపెన్‌ ప్రధాన టోర్నీకి అవసరమైన 20పాయింట్లను సాధించాడు. తొలిరౌండ్‌ జపాన్‌కు చెందిన రోటా తనూమాపై 7-5, 6-3తో గెలిచిన రామనాథన్‌.. రెండో, చివరి రౌండ్‌లో రామనాథన్‌ 5-7, 6-4, 6-1తో స్వీడన్‌కు చెందిన ఎలిస్‌ యేమర్‌పై చెమటోడ్చి నెగ్గాడు. ఈ విజయంతో 27ఏళ్ల చెన్నైకు చెందిన రామనాథన్‌ జపాన్‌లోని రియో నోగుచీ టోర్నీ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు. రామనాథన్‌ జపాన్‌ మెయిన్‌ టోర్నీకి అర్హత సాధించడం ఇది మూడోసారి మాత్రమే. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 268వ స్థానంలో ఉన్న రామ్‌కుమార్‌ ఈ విజయంతో 29 ర్యాంకింగ్‌ పాయింట్లు అతని ఖాతాలో జమ అయ్యాయి. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌లో రామ్‌కుమార్‌.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్‌ పొపిరిన్‌తో కలిసి రెండోరౌండ్‌కు చేరాడు. ప్రపంచ డబుల్స్‌ ర్యాకింగ్స్‌లో రామ్‌కుమార్‌ 69వ స్థానంలో ఉండగా.. రోహన్‌ బొప్పన్న 19వ ర్యాంక్‌ను కలిగి ఉన్నాడు. వీరిద్దరూ కలిసి 2022లో మూడు మేజర్‌ టోర్నీలో పోటీపడాల్సి ఉంది.