May 06,2023 12:47

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండలంలో జూదక్రీడలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యథేచ్ఛగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. అధికారులు, పోలీసులు వాటిని నియంత్రించాల్సి ఉన్నా పట్టించుకోవటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అక్రమార్కులు సంపాదనే ధ్యేయంగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా శిబిరాలు ఏర్పాటుచేసి పేకాటలను నిర్వహిస్తున్నారు. పేకాట రాయుళ్లు కోత ముక్క ఆటకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి పగలూ, రాత్రీ అనే తేడా లేకుండా కొనసాగిస్తున్నారు. ఈ శిబిరాలకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో హాజరవుతుండటం కొసమెరుపు. గోరి దిండ్ల సింగంపల్లి వడ్డిపల్లి ఫారెస్ట్‌ ప్రాంతంలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు గ్రామంలో అడవి ప్రాంతాలతోపాటు మరికొన్ని గ్రామాల్లో కూడా భారీ స్థాయిలో పేకాట శిబిరాలు జరుగుతున్నట్లు పేకాట రాయుళ్లు గుసగుసలాడుతున్నారు. ఈ విషయం తెలిసినా మామూళ్లమత్తులో ఉన్నట్లు పోలీసులు పట్టించుకోవటం లేదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.