Sep 26,2022 08:08

హాకవి, సామాజిక విప్లవమూర్తి జాషువా హేతువాద సాహిత్యం సృష్టికర్తల్లో ముఖ్యుడు. ఆయన కవిత్వంలో హేతువాదం ఎల్లెడల ప్రభాశిస్తుంది. జాషువా బ్రాహ్మణవాద భావజాల వ్యతిరేక కవి. ఆయన మీద అంబేద్కర్‌ ప్రభావం వుంది. హిందూ బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా ఆధునిక యుగంలో జాషువా బలంగా ఎలుగెత్తాడు. తరతరాలుగా వస్తున్న వారసత్వాన్ని కొనసాగించాడు.

''ఒకడు రుద్రాక్షమాలికలు నెత్తిన జుట్టి
శివమూర్తియై భూమికవతరించు
ఒకడూర్ధ్వ పుండ్రంబు లురువుగా దగిలించి
శివలింగమును జూచి చీదరించు
ఒకడు రెండును గాని వికటవేషము దాల్చి
పై వారి మీద సవాలు సేయు
ఒకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి
బూడిదగురవడై పుట్టివచ్చు
మనుజులారమాది ఘనమైన మతమని
ఒకడు తరిమి తరిమి యుగ్గడించు
పెక్కు మతములిట్లు పేచీలు సాగింప
మార్గమేది యైక మత్యమునకు.''


ఒకే హిందూ మతంలో వచ్చిన వివిధ శాఖలు ఎలా మారణహోమాన్ని సంఘంలో అనైక్యతను సృష్టిస్తున్నాయో జాషువా బలంగా తెలిపాడు.
హిందూ మతంలో ఐక్యతను భగం చేసే కుటిల తత్వముంది. ఆహార్యంలో, విహారంలో జీవన విధానంలో మనుషులందరినీ విభజించే జీవన సూత్రం హిందూ మతంలో ఉంది.భారతదేశంలో 'మతతత్వమంటే హిందూ మతమౌఢ్యమే' అని అంబేద్కర్‌ వ్యాఖ్యానించాడు. హిందూమతం ఎందరో కళా జీవులను అవమానపరిచింది. వారి గుండెల్ని గాయపరిచింది.

''పుట్టగావలె సత్కవీశ్వరుడు నీ పుణ్యానమా వంశపు బుట్ట జీలిచి కొంచు సంచిత కళాపూర్ణ ప్రభారాశియై పుట్టం గూడదు పుట్టినంగలుగవప్ణున్‌ నిండుసన్మానముల్‌ గట్టా యుచ్ఛత నీచతాయుత వితర్క భ్రష్ట దేశంబునన్‌''
 

                                                                 గుండె గాయాల నుంచి హేతువాదం

జాషువా గుండెకు ఎంత గాయం కాకుంటే 'వితర్క భ్రష్టదేశంబున' అంటాడు. ఇలా కవుల గుండెలు అందునా బ్రాహ్మణేతర కవుల గుండెలు అనేకసార్లు హిందూమత దౌష్ట్యానికి బద్దలయ్యాయి. హిందూ మతంలోని సాంఘిక అసమానతలను గూర్చి క్రీ.శ.1030లో భారతదేశాన్ని దర్శించిన ఆల్బెరూని రాసిన అంశాలను డా|| బి.ఆర్‌.అంబేడ్కర్‌ తన రచనల్లో ఇలా పేర్కొన్నారు : ''హిందువులు తమ కులాలను వర్ణాలుగా పిలిచేవారు. వంశం క్రమం దృష్ట్యా వీటిని పుట్టుకతో వచ్చిన జాతకాలుగా భావించవచ్చు. హిందువుల్లోని నాల్గు వర్ణాలకు చెందిన ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా గుర్తించదగిన కులం ఆపాదించబడింది. తన ఇంట్లోనే వుండి పని చూచుకొనే వారిని బ్రాహ్మణులు అంటారు. వీరిలో రోజు ఒక అగ్నిపూజ చేస్తు వుండే వారిని ఇస్తి అని మూడు అగ్నిహోత్రులకు చేసేవారిని అగ్నిహోత్రులని అగ్నికి పూజతో పాటు బలులు అర్పించేవారిని దీక్షితులని అంటారు. ఇలా హిందూ సమాజం ఒకే వర్ణంలో వివిధ నామ గోత్రాలు రూపొందించి విద్వేషానికి గురి చేసింది. ఆల్బెరూని తన రచనల్లో క్రీ.శ.11వ శతాబ్ధి నాటికి ఈనాడు శూద్రులుగా చెప్పబడుతున్న వృత్తి కులాలు ఆనాడు అస్పృశ్య కులాలుగానే వున్నాయని పేర్కొన్నాడు. వీరందరిని కలిపి అంత్యజులంటారని తెలిపాడు. శూద్రుల కన్నా తక్కువ స్థాయికి చెందిన వారిని అంత్యజులు అంటారని వీరు చేపట్టే వృత్తులను బట్టి గుర్తించటమే గాని వీరిని ఒక కులంగా పరిగణించరు. వీరిలో పరస్పర వివాహ సంబంధాలువున్నా ఎనిమిది వర్గాల (శ్రేణుల) వారున్నారు. చెప్పులు కుట్టేవారు, నేత పనివారు మాత్రం ఇతరులతో కలవడానికి వీలులేదు. ఈ ఎనిమిది శ్రేణులు 1. బట్టలు ఉతికేవారు, 2. చెప్పులు కుట్టేవారు, 3. విచిత్ర విన్యాసాలు చేసేవారు, 4. బుట్టలు అల్లేవారు, 5. పడవలు నడిపేవారు, 6. చేపలు పట్టేవారు, 7. అడవి జంతువులు, పక్షులను వేటాడేవారు, 8. నేతగాళ్ళు. నాలుగు వర్ణాలవారు వీరితో కలిసి ఒకేచోట నివసించరు. అందువల్ల ఈ ఎనిమిది శ్రేణులకు చెందినవారు ఊర్లకు పట్టణాలకు దగ్గరలో తమ నివాసాలను ఏర్పరచుకొంటారు. హాది, దోయ (దొంబ) చండాల, బద్ధతావులని పిలవబడేవారు. ఏ ఒక కులానికో శ్రేణికో చెందినవారుగా గుర్తించబడరు. వారు సాధారణంగా గ్రామ పారిశుధ్యానికి ఇతర సేవలకు అంకితం కాబడినవారు. వీరు అందరూ వేరు వేరు వృత్తుల వారైనప్పటికి ఒకే వర్ణంగా పరిగణిస్తారు. శూద్రునికి బ్రాహ్మణ వనిత ద్వారా పుట్టిన సంతానంగా భావించి వీరిని అత్యంత నిమ్న బహిష్కృత కులంగా వ్యవహరిస్తారు. ఈ వివరణను బట్టి వృత్తి కులాలన్ని ఆనాడు అస్పృశ్య కులాలుగా అంత్యజులుగా వ్యవహరించారు.
 

                                                                     కుల సమస్య - హేతువాదం

ఆయా చారిత్రక కాలాల్లో కొన్ని వృత్తి కులాలు చాతుర్వర్ణంలోకి చేరిపోయారు. కొన్ని వర్గాలు మాత్రమే అస్పృశ్య కులాలుగా మిగిలిపోయాయి. ప్రధానంగా వీరు అస్పృశ్య కులాలుగా మిగిలి పోవడానికి కారణం. హిందూ సమాజ చట్రంలోకి ఇమడడానికి వీలులేని మాతృస్వామ్య కుల నిర్మూనా సంస్క ృతులు వీరిలో దాగి ఉండటమే. వారి వర్ణతత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఆలోచిస్తే వారంతా అంత్యజులని, అవర్ణులని అస్పృశ్యులని హిందూ సమాజం శాసించింది. మనుస్మృతిలో ఈ అంశాలను ధర్మబద్ధం చేసింది. హిందూ రాజవంశాలు ఈ ధర్మాన్ని తూచ తప్పకుండా, ఆచరించాయి. డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ తన పరిశోధనాత్మక గ్రంథాల్లో హిందూ సామాజిక వ్యవస్థలో దాగున్న 'అస్పృశ్య' భావజాలాన్నే తరువాత సమాజం మీద రుద్దారని స్పష్టం చేశారు. జాషువా ఈ అస్పృశ్య సమాజంలో నలిగిపోయిన గుండెల శోధనలను వినిపిస్తే, అంబేడ్కర్‌ వాటి మూలాలను శోధించి వాటికి గల కారణాలను, నివేదించాడు. ఒకరు మహాకవి, ఒకరు సామాజిక శాస్త్రవేత్త, ఇద్దరి ప్రతి స్పందన ఒక్కటే 'హృదయము లేని లోకము సుమీ' ఇది అని జాషువా ఆక్రందిస్తే మానవత్వం లేని హిందూ సమాజం అని అంబేడ్కర్‌ సూత్రీకరించాడు. ఈయన కవితలో సామాజిక శాస్త్రం దాగుంది. ఆయన సామాజిక శాస్త్రంలో కవితా హృదయం ఉంది.

'ఈ ప్రశాంతరాత్రి యెల్ల లోకంబును
బుజ్జగించి నిద్ర బుచ్చుకొని యె
ఔషదంబు లేని యస్పృశ్యతా జాడ్య

మందభాగ్యు నన్ను మరచిపోయె' అనే పద్యంలో మరణ వేదనను జాషువా అనుభవించాడు. అంబేడ్కరూ అనుభవిం చాడు. అందుకనే అంబేద్కర్‌ గురించి జాషువా ...
 

''కలడంబేడ్కరు నా సహోదరుడు మాకైయష్టకష్టాలకు
బలియై సీమకుపోయి గ్రమ్మరిన విద్వాంసుండు వైస్రాయి మే
ల్కొల్పులందిన దొడ్డవాుడతడుడు నీకున్‌ స్వాగతంబిచ్చి పూ
పుల పూజిల్‌ వొనరించెనే యతని మెప్పుల్‌ విజయారంభముల్‌'' అన్నాడు.

    ఇందులో సోదరత్వంతో అంబేడ్కర్‌ మాకై అష్టకష్టాలు భరించి బలయ్యాడని హృదయపూర్వకంగా నివేదించాడు. జాషువా అంబేడ్కరులు ఇద్దరు ఒకే శతాబ్దంలో ఆవిర్భవించినవారు. డా||బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1891లో జన్మిస్తే, జాషువా 1895లో జన్మించాడు. అంబేడ్కర్‌ నాలుగేళ్లు జాషువా కంటే పెద్దవాడు. అంబేడ్కర్‌ మధ్య భారతంలో మౌగ్రామంలో జనించాడు. జాషువా తెలుగు నేలలో వినుకొండలో జన్మించాడు. అంబేడ్కర్‌ తల్లిదండ్రులు అస్పృశ్య కులానికి సంబంధించిన మహార్లు. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన మహాకవి జాషువా. 1895లో వీరయ్య యాదవ, లింగమాంబ మాదిగలకు సెప్టెంబర్‌ 28న వినుకొండలో జన్మించాడు. తండ్రి క్రైస్తవ మతం తీసుకున్నాడు. అస్పృశ్యత, వివక్షను, పేదరికాన్ని చిన్నతనం నుంచే అడుగడుగునా ఎదుర్కొని ఎదిగిన కవి జాషువా. భార్య పేరు మేరీ. మహాకవి జాషువా తన జీవిత ప్రస్తానాన్ని సత్యనిష్టగా సాగించాడు. ఆయన రాసిన కవిత్వం కేవలం భావ కవిత్వమో, ఉద్రేక పరిచేదో, శృంగారభరితమైనదో కాక అట్టడుగు జీవన చైతన్యాన్ని మేల్కొలిపేదిగా ఉండేది. జాషువా గ్రామీణ పదాలకు కావ్య గౌరవం కల్పించిన వాడు. దీపము అనే పదానికి తిర్లిక అనే పదం వాడిన ఘునుడు జాషువా అని బొద్దులూరి నారాయణ రావు చెప్పేవారు. తన జీవితంలో నిత్యం జరిగే అంశాలను తీసుకొని కవిత్వం చేయడంలో దిట్ట జాషువా. మానవ సంబంధాలే కాక జీవన సంబంధాలు కూడా ఆయన కవిత్వంలో ఒక పాఠశాలలా నడిచాయి. జాషువా రచనల్లో కులతత్వ నిరసన అంతటా నడిచింది. ఆయన ప్రతి కదలికలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూనే వచ్చారు. జీవితం ఆయన కవిత్వంలో శిల్పానికి మూలం. జాషువా కవిత్వానికి గానీ, దళిత కవిత్వానికి గానీ ప్రాణం జీవితమే. కవిత్వం ఒక సామాజిక చరిత్రకు నిధి అనేది జాషువా కవిత్వం నిరూపిస్తుంది. జాషువా సామాజిక స్పృహ ఉన్న కవులందరికీ దిక్సూచి. జాషువా కవిత్వంలో, ఔషధ గుణాలున్నాయి. మానవతా దీప్తి ఉంది. మనసులో ఉన్న మాలిన్యాలను కడిగివేసే సంఘవాదాన్ని జీవితానికి అన్వయించే తత్వం ఉంది.
      అందుకే జాషువా కవిత్వం ఒక సామాజిక జీవన పాఠశాల. మానవతా స్పర్శ, తాత్త్విక దృక్పథం వీరి రచనల నిండా కన్పిస్తుంది. చాతుర్వర్ణ, వేయిపడగల సంస్కృతి అంతా కల్పితమేనని చెప్పడం జాషువాది సామాజిక విప్లవ మార్గమే అవుతుంది. కాళిదాసు కవిత్వం కంటే కూడా జాషువా కవిత్వంలో విశిష్టత ఉంది. జాషువాది కులాధిపత్య వ్యతిరేక కవిత. వీరి కవిత్వంలో నిర్భయత్వం, ఆత్మగౌరవం ప్రధానమైనవి.
     జాషువా రచనల్లో 'గబ్బిలం' విశిష్టమైనది. సామాజిక చరిత్ర అధ్యయనానికి, దళిత చరిత్ర రచనకు గబ్బిలం ఒక ఆకర గ్రంధం. 1946లో చెళ్లపెళ్ళ వెంకటశాస్త్రి జాషువాకు గండపెండారం తొడిగి నవయుగ చక్రవర్తి అనే బిరుదునిచ్చారు. త్రిపురనేని రామస్వామి, కొండవీటి వెంకట కవి, తుమ్మల సీతారామమూర్తి, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహా మహా ఉద్ధండ పండితులు వీరిని సన్మానించారు. వీరి కవితా శృతి గొల్లసుద్దులు అయినా అడుగడుగునా అభ్యుదయం, హేతువాదం వీరి రచనల్లో గోచరిస్తాయి. తెలుగు సాహిత్య చరిత్రలో మహాకవి ప్రత్యామ్నాయ సాహిత్య దిక్సూచి. హేతువాద దృక్పథ మార్గదర్శి. తెలుగు కవితా లోకంలో జాషువా సాహిత్యం అజరామరం.

(ఈ నెల 28న గుర్రం జాషువా జయంతి)
- డా|| కత్తి పద్మారావు
98497 41695