Jun 24,2022 06:25

కొబ్బరికాయ కొనేటప్పుడు అందులో నీళ్ళున్నాయో లేదో అని చెవిదగ్గర కాయను ఊపి, ఊపి నీళ్ళ శబ్దం వినడానికి ప్రయత్నిస్తారు. అదేం చిత్రమో కానీ - ఆ కొబ్బరికాయ కొట్టే దేవుడు ఆ విగ్రహంలో ఉన్నాడో లేదో అని మాత్రం తేల్చుకోరు. ఏ నిర్ధారణ, నిరూపణ లేకుండానే నమ్మేస్తారు. మనువాదుల కుట్రకు బలై ఆ భావజాలాన్ని స్వీకరిస్తారు. అంతే కాదు దేవుడనే వాడు విగ్రహంలోనే కాదు. ఎక్కడైనా ఉంటాడు- అనే అంధవిశ్వాసంలో కూరుకుపోతారు. ''ఇందుగలడందు లేడని సందేహము వలదు'' అని నమ్ముతుంటారు.
'రాముడు దేవుడు కాదు'-అని ప్రకటించారు బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితిన్‌ రాం మాఝీ. ఆ పేరు కేవలం ఒక కల్పిత పాత్రది మాత్రమేనని, ఆ పాత్రను సృష్టించుకున్న వాల్మికి, తులసీదాస్‌ వంటి కవులు కావ్యాలు రాశారు తప్ప, నిజానికి శ్రీరామచంద్రుడనేవాడు ఎప్పుడూ, ఏ కాలంలోనూ, ఏ ప్రాంతంలోనూ బతికి లేడని ఆయన వివరణ ఇచ్చారు. కవులుగా వారిని గౌరవించుకోవచ్చు. కాల్పనిక రచనలుగా వారి రచనల్ని విశ్లేషించుకోవచ్చు. అంతేగాని ఒక కల్పిత పాత్రను పూజించడమేమిటీ? ఉత్సవాలు, పండుగలు జరుపుకోవడమేమిటీ? అని ప్రశ్నించారు. పైగా మరో మాట కూడా అన్నారు. మన ముందు తరం వారికి మనకు ఉన్నన్ని అవకాశాలు లేవు. మనం సాధించినంత ప్రగతి సాధించలేకపోయారు. అది అలా వదిలేసి, మన తరం కొత్తగా, హేతుబద్ధంగా ఆలోచించాలి కదా? ముందు తరం వారికి మెదడు పని చేయకపోతే పోయింది. ఇప్పుడు ఈ కాలం మనుషులకు ఏమైందీ? అదే మూఢత్వం కొనసాగిస్తూ ఉంటారా? అని, ఆ మాజీ ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు.
సమాజంలోని అన్ని రంగాలలో తమ ఆధిపత్యం ఎలాగైనా కొనసాగుతూ ఉండాలని మనువాదులు కుట్రలు పన్నుతుంటారు. ఏవేవో పుకార్లు పుట్టిస్తుంటారు. ఇటీవల ఓ సన్నాసి బాబా గురువు తన భక్తులకు ఒక మంత్రోపదేశం చేశాడు. అదేమిటంటే... 'ఏ మందు బిళ్ళయినా (టాబ్లెట్‌) వేసుకునే ముందు మహామృత్యుంజయ మంత్రం రెండుసార్లు చదివితే - మందుబిళ్ళ బాగా పనిచేసి, రోగం సత్వరమే తగ్గిపోతుందని'! అదే నిజమైతే-ఆసుపత్రుల ముందు, మెడికల్‌ షాపుల ముందు, ఫార్మా కంపెనీల ముందు అదే మాట రాసి బోర్డులు పెట్టాలి. జనం బుద్ధిగా దాన్ని పాటిస్తారా? లేక పాత చెప్పులు వెతికి తీసుకొస్తారా? చూడాలి. ఆధునిక వైద్య శాస్త్రానిక్కూడా మీ పైత్యం అంటగట్టకండిరా బాబూ-కావాలంటే నమ్మకం ఉన్న వాళ్ళు టాబ్లెట్ల వాడకం మానేసి మహామృత్యుంజయ మంత్రమే చదువుకుంటూ తమ వ్యాధులు నయం చేసుకోవచ్చు కదా? ఎవరు కాదన్నారూ? ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది టాబ్లెట్లు వాడి జబ్బులు తగ్గించుకుంటున్నారు. లేదా అదుపులో ఉంచుకుంటున్నారు. పిచ్చి నమ్మకాలున్న వారికే నోరు అదుపులో ఉండటం లేదు. అదీ మన భారతదేశంలోనే - ఇతర దేశాల్లో ఎవరూ మహామృత్యుంజయ మంత్రం పేరు కూడా విని ఉండరు. మన దేశంలో కొందరు విన్నా ఆ మంత్రమేమిటో ఎవరికీ తెలియదు. అది పని చేస్తుందనడం ఒక అబద్ధం. అది నిరూపించగల వాళ్ళుంటే నిరూపించాలి. మన దేశ ఆరోగ్య రంగానికి గొప్ప మేలు జరుగుతుంది. నిరూపించడం చేతగాకే మానసిక బలహీనుల మీద ప్రభావం చూపే పుకార్లు అన్నీ మాధ్యమాలలో వ్యాప్తి చేస్తున్నారు.
అడవిలో ఎన్నికలు జరుగుతుంటే చెట్లన్నీ గొడ్డలికే ఓటు వేశాయట, - కారణమేమంటే 'గొడ్డలికి ఉన్న కర్ర తమ కులానికి చెందిందే' - అని. ఇందులో ఏమైనా అర్థముందా? గొడ్డలి కర్రను గెలిపించుకుంటే ఏమవుతుంది? గొడ్డలి చెట్లన్నింటిని నరికేస్తుంది కదా? అమాయక జనం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని రెండోసారి తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నాం. అధికార పార్టీ విధానాల వల్ల ఎనిమిదేళ్లలో 60-70 శాతం ధరలు పెరిగాయి. 2014-15 లలో పెట్రోలు, డీజిల్‌ ధరలు రూ.71-55 కాగా ఈ సంవత్సరం అది 120-106కి పెరిగింది. వంట గ్యాస్‌ రూ.414 నుండి రూ.1002కు పెరిగింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మన దేశం కూడా శ్రీలంక లాగా అయిపోయినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.
రెండోసారి బిజెపిని ఎన్నుకున్నందుకు ఉద్యోగులకు గొప్ప బహుమతి లభించింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ డిపాజిట్‌ వడ్డీరేటు 8.1 శాతానికి తగ్గిపోయింది. ఇది ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయి. కోట్లాది మంది ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావం పడింది. గొడ్డలికి ఓటేస్తే వేటు పడేది పచ్చని చెట్ల మీదే కదా? ఇది ఇలా ఉంటే అఖిల భారత ఆర్‌ఎస్‌ఎస్‌ అత్యున్నత ప్రతినిధి సభ మార్చి 11, 2022న గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌లో ప్రారంభమైంది. సంఫ్‌ు చాలక్‌, సంఫ్‌ు కార్యవాV్‌ా మొదలైన వారితో పాటు సుమారు 1200 మంది కీలక నాయకులు పాల్గొన్నారు. రెండేళ్లలో దేశమంతటా - మండల స్థాయి నుండి తమ శాఖలు ఏర్పాటు చేసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. నిశ్శబ్దంగా ప్రమాద ఘంటికలు మోగుతున్న చప్పుడు దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. ప్రతిపక్షాలేవీ...ఎక్కడా? దేశ ప్రజలారా! మీ ప్రభుత్వాన్నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి! జాగ్‌తే రహో!!
విద్యా సంస్థల కాషాయీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు సాగిస్తూనే ఉంది. వ్యవస్థలన్నింటికీ కాషాయం పులిమే పని విజయవంతంగా కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే యుపిఎస్‌సి ఛైర్మన్‌ పదవిలో తమకు సన్నిహితుడైన మనోజ్‌ సోనీని నియమించింది. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సోనీ ఆయనకు ఉపన్యాసాలు రాసిచ్చేవాడు. ఆ సాన్నిహిత్యం వృధా పోలేదు. వడోదర యం.యస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సిలర్‌ అయ్యాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ కు, బిజెపి కి సన్నిహితుడు కావడం వల్లనే ఇప్పుడు మళ్ళీ యుపిఎస్‌సి ఛైర్మన్‌ అయ్యాడు. ఈ మనోజ్‌ సోనీది గతంలో ముంబైలో అగరొత్తులు అమ్ముకున్న స్థాయి. 12వ తరగతిలో సైన్స్‌లో పరీక్ష తప్పేంత మేధస్సు. అయినా కూడా మోడీ లింక్‌ దొరికింది గనక-ఉన్నత పదవులు అందుకోగలుగుతున్నాడు. సైన్స్‌లో ఫెయిల్‌ అయ్యాడు గనక ఆర్ట్స్‌ చదవాల్సి వచ్చింది. చదివితే తప్పు లేదు. కానీ, రీజనింగ్‌ లేని విషయాలన్నింటినీ ప్రమోట్‌ చేస్తున్నాడు. పది పాస్‌ కాలేనివాడు ఓ యం.ఎ. డిగ్రీ కొనుక్కుని ప్రధాని కాలేదా...! అక్రమ మార్గంలో పైకొచ్చినవాడు అలాంటి వారినే కదా చేరదీస్తాడూ? 'మోడికి ఎక్కాలు రావు. ఆర్థికరంగం గురించి ఏం తెలుస్తుందీ' అని వారి బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామియే బాహాటంగా ప్రకటించాడు. అందులో రహస్యమేమీ లేదు. న్యాయశాస్త్ర కోవిధుడైన మన తెలుగువాడే సమాచార హక్కు చట్టం (ఆర్‌ఐటి) కింద ప్రధాని విద్యార్హతలేమిటి? అని అడిగితే ''అది రహస్యంగా ఉంచవల్సిన విషయం'' అని ప్రధాని కార్యాలయం బదులిచ్చింది. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ టెలివిజన్‌ ఛానల్‌లో కరణ్‌ థాపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా హైస్కూలు వరకు చదువుకున్నానని వినయంగా చెప్పుకున్నాడు. ఆ ప్రసారం నేను చూశాను కూడా!
అంబేద్కర్‌ జయంతి సందర్భంగా 14 ఏప్రిల్‌ 2022న కర్ణాటక కాంగ్రెస్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్‌ స్వయంగా తన అనుభవాలు పంచుకున్నారు. ఈ దేశంలో కుల వ్యవస్థ వేళ్ళూనుకుని ఉందని, ఎన్ని ఉన్నత పదవులలో ఉన్నా కుల వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నానని చెప్పుకున్నారు. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ ఇలాంటి పరిస్థితి లేదని వాపోయారు. ఈ పరిస్థితులు చూసి ఒక ఉర్దూ కవి ఇలా అన్నాడు... ఆసిఫ్‌ -ప్యాస్‌ లగీతో, మజిద్‌, గురుద్వారా, చర్చ్‌, హోటల్‌ మె చలే జానా- బస్‌ మందిర్‌ మె మత్‌ జానా మెరె భారు - మందిర్‌ ఆజ్‌ కల్‌ భగ్‌వాన్‌ క నహీు - సంఫ్‌ుపరివార్‌ క ఘర్‌ హై - చదువుల్లేవు - ఇంగిత జ్ఞానం లేదు - మతం పేరుతో కనిపించని దేవుడి పేరుతో, హనుమాన్‌ చాలీసా పేరుతో - శోభాయాత్రల పేరుతో మత విద్వేషాలు రగిలించి, జనాన్ని హేట్‌ వాదంలోకి దింపే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాల్ని దేశ ప్రజలు నిశితంగా అర్థం చేసుకోవాల్సి ఉంది. గుడికి నువ్వు లక్ష రూపాయల విరాళమిచ్చినా నిన్ను అక్కడ కేవలం భక్తుడిగానే గుర్తిస్తారు. అదే డబ్బు బయట పేదవారికి పంచి చూడు. వారు నిన్ను ''దేవుణ్ణి'' చేస్తారు. దేవుడు అంటే నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడని కాదు. అత్యున్నతమైన గౌరవ భావంతో చూడటం. మనుషులుగా మనుషులకు పనికొచ్చే పని చేద్దామా? మనుషులమన్నది మరిచి పేదల ఇళ్ల పైకి బుల్‌డోజర్లు పంపి కూల్చేద్దామా? ఏది మానవత్వం? హనుమాన్‌ ఎవరు? రామాయణ కావ్యంలో రాముడి పాత్రకు బానిసగా బతికిన పాత్ర. ఆ బానిసకు సంబంధించిన చాలీసా పఠిస్తూ, శోభాయాత్రలు తీస్తూ బానిసకు - బానిసలుగా బతకడమే జీవిత ధ్యేయమా? ''ఇందులేడందు లేడని సందేహము వలదు / ఎందెందు వెదికి చూసిన - అందందే లేడు చక్రి!'' అనేది వాస్తవం!
2

 

 

 

 

 

 

 

 

 

 

వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత,జీవశాస్త్రవేత్త 
డా|| దేవరాజు మహారాజు