
ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై మొదటిసారి ఫెస్బుక్ లైవ్‌లో స్పందించారు. కుర్చీ కోసం తాను పోరాడనని.. అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, రాజీనామా లేఖ కూడా సిద్ధంగా ఉందని అన్నారు. శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదన్నారు. మంత్రి ఏక్నాథ్ షిండేతో వెళ్లిన ఎమ్మెల్యేల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. తమను బలవంతంగా తీసుకెళ్లారని వారంతా వాపోతున్నారని ఉద్ధవ్ థాకరే చెప్పారు.
బిజెపి పాలిత అసోంలోని గువహటిలో ఒక హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీకి లేఖ రాశారు. షిండే ఇప్పటికీ శివసేన శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ఐదుగంటలకు పార్టీ సమావేశం నిర్వహిస్తామని పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభు పిలుపునిచ్చారని ..ఆ సమావేశం చట్ట వ్యతిరేకమని రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తాము ఇప్పటికీ శివసేనతోనే ఉన్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. చీఫ్ విప్‌గా సునీల్‌ప్రభు నియామకాన్ని రద్దు చేయాలని అన్నారు.