Jun 13,2022 20:03

- ఎపిఎస్‌ఇఆర్‌ఎంసికు మంత్రి బొత్స ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 
పాఠశాల విద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రతిపాదనలు చేయాలని ఎపి పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (ఎపిఎస్‌ఇఆర్‌ఎంసి)ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్‌, కమిషనరు సురేష్‌ కుమార్‌తో కలిసి కమిషన్‌ కార్యక్రమాలు, గ్రంథాలయాల నిర్వహణలపై ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. సిఎం ఆలోచలనలకు అనుగుణంగా కమిషన్‌ క్రియాశీలకంగా పనిచేయాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో సభ్యులు జరిపిన పరిశీలనలు, తనిఖీల్లో కనుగొన్న అంశాలపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూనియర్‌ కళాశాలలు, పాఠశాలలను కమిషన్‌ గతంలో తనిఖీ చేసి, పలు లోపాలను గుర్తించి నివేదికలు అందజేసిందని తెలిపారు. కమిషన్‌ క్రియాశీలకంగా పనిచేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. వినూత్న ఆలోచనలతో ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని ఆదేశించారు. కమిషన్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సిఇఒ ఎ సాంబశివారెడ్డి, వైఎస్‌ ఛైర్‌పర్సన్‌ విజయశారదరెడ్డి పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు.
గ్రంథాలయాల పూర్వవైభవానికి ప్రణాళిక
గ్రంథాలయాల పునరుజ్జీవనానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి బొత్స ఆదేశించారు. మంచి ఆకృతులతో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. గ్రంథాలయాలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు అనువుగా అవసరమైన సిబ్బందిని అవుట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. డిజిటలైజేషన్‌, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాఠశాలలతో గ్రంథాలయాలను ఇంటిగ్రేట్‌ చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. గ్రంథాలయాల తీరు తెన్నులను గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్‌ ఎం శేషగిరిరావు, డైరెక్టరు ఎంఆర్‌ ప్రసన్న కుమార్‌ వివరించారు.