Nov 25,2022 12:46
  • ముందుకుసాగని భూసేకరణ
  • నత్తనడకన 11 రైల్వే పథకాలు
  • ఏడు పథకాలకు నిధుల కొరత

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కొత్త ప్రాజెక్టుల ద్వారా రైళ్లు పట్టాలెక్కేందుకు అనేక సమస్యలు బ్రేక్‌ వేస్తున్నాయి. ఒకవైపు భూసేకరణ కీలక సమస్యగా మారుతుండగా, మరోవైపు నిధులు అడ్డంకిగా మారుతున్నాయి. మొత్తం 11 కీలక ప్రాజెక్టులను ఈ సమస్యలు వేధిస్తున్నాయి. 11 కీలక పనులను గతంలోనే కేంద్ర రైల్వే శాఖ రాష్ట్రానికి కేటాయించింది. నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నర్సాపూర్‌, కడప-బెంగళూరు మధ్య కొత్త లేన్ల నిర్మాణం, గుంటూరు -గుంతకల్‌, గుంటూరు-గుంతకల్‌, గుంటూరు-నంద్యాల డబ్లింగ్‌ పనులు, కాజీపేట్‌-విజయవాడ మధ్య ట్రిప్లింగ్‌ పనులు, గుత్తి, రేణిగుంట వద్ద బైపాస్‌ నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. వీటిని రాష్ట్ర, కేంద్ర వాటా నిధులతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం పనులకు 4,494 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో ప్రయివేటు భూమి 2,814 హెక్టార్లు, ప్రభుత్వ భూమి 1,438 హెక్టార్లు, అటవీ భూమి 242 హెక్టార్లు కావాల్సి ఉంటుందని గుర్తించారు. ఇప్పటివరకు 2,023 హెక్టార్లు మాత్రమే సేకరించగా, ఇంకా 2,472 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. మొత్తం భూసేకరణలో ప్రయివేటు భూమితోనే ఎక్కువ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలో 2814 హెక్టార్లకుగాను 1161 హెక్టార్లు మాత్రమే సేకరించగలిగారు, ఇంకా 1653 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. భూమి యజమానులకు చెల్లించాల్సిన పరిహారం, వారికి కల్పించాల్సిన పునరావాసం వంటి అంశాల కారణంగానే సేకరణలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా ఇదే తరహా జాప్యం కనిపిస్తోంది. 1438 హెక్టార్లకుగాను 743 హెక్టార్లు సేకరించగా, ఇంకా 695 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. అటవీ భూమికి సంబంధించి 242 హెక్టార్లకుగాను 118 హెక్టార్లు సేకరించగా, 124 హెక్టార్లను ఇంకా సేకరించాల్సి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
 

                                                                  నిధుల సమస్యతో...

ఏడు పథకాలకు రాష్ట్ర ఆర్ధికశాఖ నుంచి విడుదల కావాల్సిన రాష్ట్ర వాటా నిధులు విడుదల కాలేదని తెలుస్తోంది. నడికుడి-కాళహస్తి లేన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆరు కోట్లు కేటాయించగా, ఇంకా రూ.1306 కోట్లు ఇవ్వాల్సి ఉంది. విజయవాడ-నిడదవోలు డబ్లింగ్‌ పనులకు రూ.289 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ.1798 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్‌ పనులకు కేవలం రూ.2.7 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ.367 కోట్లు ఇవ్వాల్సి ఉంది. భద్రాచలర రోడ్‌-కొవ్వూరు లేన్‌కు రూ.361 కోట్లు, టుముకూరు-రాయదుర్గం పనులకు రూ.260 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది కూడా పనులు ముందుకు సాగకపోవడానికి కారణంగా చెబుతున్నారు.